Begin typing your search above and press return to search.

మంచు ఫ్యామిలీలో మళ్లీ మంటలు... నారా వారి పల్లె నుంచి మొదలు!!

మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కనుమ రోజున నారవారిపల్లెకు వెళ్లిన మనోజ్.. లోకేష్ ను, నారా రోహిత్ ను కలిశారు.

By:  Tupaki Desk   |   16 Jan 2025 5:50 AM GMT
మంచు ఫ్యామిలీలో మళ్లీ మంటలు... నారా వారి పల్లె నుంచి మొదలు!!
X

మంచు మోహన్ బాబు కుటుంబంలో మంటల వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనకు మనోజ్ తో ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడం.. తనకూ ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయడం.. మొదలైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి! ఆ సమయంలో మోహన్ బాబు ఇంటివద్ద జరిగిన గలాటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే... అనంతరం పోలీసులు, కోర్టు కారణంగా కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు జరిగినట్లు మీడియాలో కనిపించలేదు! అయితే... సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున మరోసారి మంచు ఫ్యామిలీలో మంటలు పార్ట్-2 స్టార్ట్ అయ్యిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో అసలు ఏమి జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దామ్!

అవును... మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కనుమ రోజున నారవారి పల్లెకు వెళ్లిన మనోజ్.. లోకేష్ ను, నారా రోహిత్ ను కలిశారు. అనంతరం మోహన్ బాబు విద్యాసంస్థల క్యాంపస్ లో ఉన్న తన నానమ్మ, తాతయ్య, తన కజిన్ మంచు ప్రసాద్ ల సమాధులను చూసి, దండం పెట్టుకోవాలని వెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో.. మనోజ్, మౌనిక దంపతులను విద్యాసంస్థల లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వస్తున్నాడని తెలిసి గేట్లు అన్నీ మూసేసినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో తనను అడ్డుకోవడంపై స్పందించిన మనోజ్.. తాను జనరేటర్లో చక్కెర వేయడం, ఫ్లెక్సీలు చెంపడం వంటి చిల్లర పనులు చేయనని అన్నారు.

తన నానమ్మ, తాతయ్యల సమాదులు చూసి వెళ్లాలని వచ్చానని అన్నారు. తాను యూనివర్శిటీలోకి వెళ్లకూడదని, తన గ్రాండ్ పేరెంట్స్ సమాధులు చూడటానికి వెళ్లవద్దని కోర్టు కండిషన్స్ లేవని.. ఉన్నా.. ఆ కాపీ తనకు అందలేదని.. తనను అడ్డుకున్నందుకు తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సమసిపోతాయని పునరుధ్గాటించారు.

మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు!:

మనోజ్ దంపతులు మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు వెళ్లిన వ్యవహారానికి సంబంధించి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా.. ప్రెస్ నోట్ విడుదల చేశారు. మంచు మనోజ్ కుమార్ సంక్రాంతి పండుగకు తన మేనత్త ఇంటికి నారావారి పల్లెకు వస్తానంటే ఆమె అంగీకరించలేదని.. అయినప్పటికీ దురుద్దేశం పెట్టుకుని నారావారి పల్లెకు వచ్చాడని మోహన్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా... నారా లోకేష్ ను కలిసి వెళ్లాడని.. కలిసి సినిమా తీస్తున్న కారణంగా నారా రోహిత్ ను కలిసి వెళ్లాడని తెలిపారు. అయితే... తిరిగి వస్తూ డా. మోహన్ బాబు స్కూలు గేటు వద్ద 200 మందితో స్కూల్ లోపలికి రావాలని ప్రయత్నించారని.. కానీ, కోర్టు ఆదేశాల మేరకు విద్యాసంస్థల్లోకి నువ్వు వెళ్లకూడదని పోలీసులు అతనికి చెప్పారని అన్నారు.

ఆ తర్వాత కొంత ముందుకు వెళ్లి మోహన్ బాబు విద్యాసంస్థల్లోని డైరీ ఫారంలోని గేటును ఎగిరి దూకి లోపలికి వెళ్లాడని.. ఇది కచ్చితంగా కోర్టు దిక్కరణకు సంబంధించినదని.. అందువల్ల ఇతనిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి, కోర్టుకు అప్పీలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో.. మంచు ఫ్యామిలీలో మంటలు మళ్లీ మొదలు అనే చర్చ తెరపైకి వచ్చింది.