'మంచు ఫ్యామిలీలో మంటలు'లో బిగ్ ట్విస్ట్... కలెక్టర్ ఆఫీసులో మనోజ్!
సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని అ ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందించారు.
By: Tupaki Desk | 18 Jan 2025 9:58 AM GMTగత కొన్ని రోజులుగా 'మంచు ఫ్యామిలీలో మంటలు' అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గత ఏడాది తనకు ప్రాణహాని ఉందంటూ అటు మంచు మనోజ్.. మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అవును... మంచు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా సంచలన విషయాలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఇటీవల సంక్రాంతి పండుగ వేళ తన నానమ్మ, తాతయ్యల సమాధుల వద్దకు వెళ్లడం కోసం మనోజ్ దంపతులు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీకి వెళ్లడం, వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో మళ్లీ మొదలైంది!
దీనిపై అటు మోహన్ బాబు వైపు నుంచి, ఇటు మనోజ్ వైపు నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి! ఇదే సమయంలో... జల్ పల్లిలోని తన ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని.. తన ఆస్తుల్లో ఉన్నవారిని వెంటనే ఖాళీ చేయించి, తన ఆస్తులు తనకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని అ ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా.. మోహన్ బాబు ఆస్తులపై నివేదిక ఇవ్వాలని కోరారు! దీంతో.. జల్ పల్లిలోని ఇంటిని ఖాళీ చేయాలని మనోజ్ కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారని అంట్న్నారు!
ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా కలక్టర్ ను మంచు మనోజ్ కలిశారు. ఈ సందర్భంగా.. జల్ పల్లి లోని నివాసంలో తాను ఉంటున్న విషయంపై తనకు అందించిన నోటీసులతో పాటు పలు విషయాలపై కలెక్టర్ తో మంచు మనోజ్ చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా... గత ఏడాది జల్ పల్లి లోని నివాసంలో జరిగిన ఘర్షణ వాతావరణం అనంతరం మోహన్ బాబు ఎక్కువగా తిరుపతిలోనే ఉంటున్న సంగతి తెలిసిందే! మరోపక్క జల్ పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ తన ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో నుంచి మనోజ్ ను ఖాళీ చేయించి తనకు ఇప్పించాలని మోహన్ బాబు కోరగా.. తాజాగా నోటీసుల మేరకు కలెక్టర్ ఆఫీసుకు మనోజ్ వెళ్లారని తెలుస్తోంది!