Begin typing your search above and press return to search.

ఇంట్లో చికిత్స అందిస్తున్న వైద్యులు... మంచు మనోజ్ కు ఏమైంది?

ఇలా రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనోజ్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో... ఆయనకు జల్ పల్లి లోని ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   11 Dec 2024 6:17 AM GMT
ఇంట్లో చికిత్స అందిస్తున్న వైద్యులు... మంచు మనోజ్  కు ఏమైంది?
X

జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ తనపై (విష్ణు తరుపు) బౌన్సర్లు దాడి చేశారని అంటుంటే.. అదే సమయంలో మోహన్ బాబు నేరుగా మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు! ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందనే చర్చా తెరపైకి వచ్చింది.

మరోపక్క తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లారు మోహన్ బాబు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు వెంట పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోపక్క మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

అవును... ఆదివారం సాయంత్రం ఆస్పత్రికి నడవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపించిన మనోజ్ కు కడుపులోనూ, వెన్నుముక కు గాయలైనట్లు.. గోళ్లతో పలు చోట్ల రక్కి ఉన్నట్లు గుర్తించారని మెడికో లీగల్ రిపోర్ట్ లో వెల్లడైనట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మనోజ్ పై గట్టిగానే దాడి జరిగినట్లుందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఆ వ్యవహారంపై సోమవారం నాడు పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే... మంగళవారం జల్ పల్లిలోని నివాసం వద్ద మాత్రం తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. ఈ సమయంలో లోపల మనోజ్ ఒక్కడే అయిపోయారనీ చెబుతున్నారు!

మరోపక్క బలవంతంగా గేటు నెట్టుకుంటూ లోపలికి వెళ్లిన మంచు మనోజ్.. తిరిగి వచ్చేటప్పుడు చిరిగిన చొక్కాతో కనిపించారు. ఈ సమయంలో... మనోజ్ పై విష్ణు బౌన్సర్లే దాడి చేసినట్లు కథనాలొస్తున్నాయి. దీంతో.. వరుసగా జరుగుతున్న దాడుల కారణంగా మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.

ఇలా రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనోజ్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో... ఆయనకు జల్ పల్లి లోని ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దీంతో... ఇవాళ రాచకొండ పోలీసుల ముందు మనోజ్ విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.