#స్టే ఇన్ యువర్ లేన్... ప్రకాశ్ రాజ్ కు మంచు విష్ణు రిప్లై!
ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై నటుడు, "మా" అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు సమాధానం ఇచ్చారు.
By: Tupaki Desk | 21 Sep 2024 9:48 AM GMTతిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. వాస్తవాస్తవాలు తెలపాలని భక్తులు, ధార్మిక సంస్థలు కోరుతున్నాయి. సత్వర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇందులో భాగంగా... తిరుమల బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు బయటపడిందని.. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందామని.. దీనిపై వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.
ఇదే సమయంలో.. దేశంలోని అన్ని ఆలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పందించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ ను కోట్ చేస్తూ... "మీరు డిప్యుటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి" అని సూచించారు.
అనంతరం... "మీరెందుకు అనవసరంగా భయాందోళనలు కల్పిస్తూ, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు" అని ట్వీట్ చేశారు. చివర్లో... "కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు" అని ముగించారు. ఈ ట్వీట్ పై కామెంట్ సెక్షన్ లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.
ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై నటుడు, "మా" అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు సమాధానం ఇచ్చారు. ‘శ్రీ ప్రకాశ్ రాజ్’ అని అంటూ మొదలు పెట్టి.. చెప్పాలనుకున్న విషయం చెప్పి... సంయమనంతో ఉండాలని హితవు పలుకుతూ... చివర్లో ‘#మీ పరిధిలో మీరు ఉండండి’ అని సూచించారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ... "శ్రీ ప్రకాశ్ రాజ్... దయచేసి మీరు అంతలా నిరుత్సాహపడకండి, అసహనం వ్యక్తం చేయకండి. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. నాలాంటి కోట్లాది మంది హిందువుల నమ్మకానికి ప్రతీక. డిప్యూటీ సీఎం పవన్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు.. ధర్మ పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటారు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇదే పోస్ట్ లో... "ఇలాంటి వ్యవహారాల్లో మీలాంటి వారు ఉన్నప్పుడు.. మతం ఏ రంగు పులుముకుంటుందో?" అని అంటూ... #మీ పరిధిలో మీరు ఉండండి అని మంచు విష్ణు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.