Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఈస్ ఏ వైబ్ అంటున్న మంచు లక్ష్మీ... ఆ ప్రకంపన ఇదేనా?

సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:12 AM GMT
ఢిల్లీ ఈస్ ఏ వైబ్ అంటున్న మంచు లక్ష్మీ... ఆ ప్రకంపన ఇదేనా?
X

సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటన, నిర్మాణంతో పాటు సోషల్ యాక్టివిటీస్ లోనూ ఆమె చురుకుగా ఉంటారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని తెలుస్తుంది!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న దాదాపు ప్రతీ పార్టీలోనూ చేరికలు, అలకలు, బుజ్జగింపులు, జంపింగులు అత్యంత సహజం అనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో మంచు లక్ష్మి... భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఢిల్లీకి రమ్మని ప్రధానమంత్రి కార్యాలయం నుండి మంచు లక్ష్మికి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది!

దీంతో ఈ పిలుపు ఎందుకోసమనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెను పార్టీలోకి ఆహ్వానించడానికి ఢిల్లీకి పిలిపిస్తున్నట్టుగా ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే హస్తినకు చేరుకున్నారని తెలుస్తుంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం... బీజేపీకి దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్ర, అటు తెలంగాణాలో బీజేపీ తమ బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మంచు లక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ పిలుపు అని అంటున్నారు.

మరోపక్క మహిళా బిల్లును కేంద్ర కాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో... దీని కోసం దేశ నలుమూలల నుంచీ చాలామంది ఫేమస్ మహిళలను పిలిపించి మాట్లాడతారని, అందులో భాగంగానే మంచు లక్ష్మిని పిలిచి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇలా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది!

ఇదే సమయంలో తాజాగా ట్విట్టర్ లో స్పందించిన మంచు లక్ష్మి... "ఢిల్లీ ఈజ్ ఏ వైబ్" అని ట్వీట్ చేశారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరినట్లయ్యిందని అంటున్నారు. ఈ సందర్భంగా "పొలిటికల్ ఎంట్రీ... కంగ్రాట్స్" అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.