మోడీ ఉన్న బహిరంగ వేదికపై మంద కృష్ణమాదిగ కన్నీరు
దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. మోడీ ఆలింగనంతో.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు కృష్ణమాదిగ
By: Tupaki Desk | 11 Nov 2023 4:39 PM GMTప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న 'మాదిగ విశ్వరూప మహాసభ'లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సభలో మోడీ సమక్షంలోనే మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సభకు మోడీ వస్తారని అనుకోలేదని.. దేశాన్ని ఏలుతున్న నాయకుడు రావడం తనకెంతో సంతోషాన్ని మాదిగలకు ఆత్మ బలాన్ని ఇస్తోందని పేర్కొంటూ.. కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. సభకు హాజరైన ప్రధాని మోడీ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను వేదికపైనే ఆలింగనం చేసుకుని.. హత్తుకున్నారు.
దీంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. మోడీ ఆలింగనంతో.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు కృష్ణమాదిగ. కన్నీటి పర్యంతం అయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. దీన్ని చూసిన ప్రధాని మోడీ.. తన సీటు పక్కనే మంద కృష్ణ మాదిగను కూర్చోబెట్టుకున్నారు. కుర్చీని దగ్గరకు తీసుకుని.. అతని భుజంపై చేయి వేశారు.. మంద కృష్ణ మాదిగను ఓదార్చారు. ఐదు నిమిషాలపాటు ఈ దృశ్యం సభలో ఆసక్తి రేపింది. ప్రధాని స్థాయి వ్యక్తి.. తనకు ఇచ్చిన గౌరవం, సభకు హాజరైన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో సభ హోరెత్తింది.
''ఈ సభకు ప్రధాని మోడీ వస్తారని మేం ఊహించలేదు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోడీదే. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది బీజేపీనే. మోడీకి సామాజిక స్పృహ ఉంది కనుకే మా సభకు వచ్చారు. బలహీనవర్గాల కష్టాలు ప్రధాని మోడీకి బాగా తెలుసు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్యపరుస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేవలం మాటలే చెబుతున్నాయి. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మాదిగ మంత్రి కూడా లేరు. తక్కువ జనాభా ఉన్న కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు.'' అని ఈ సందర్భంగా కృష్ణ మాదిగ ప్రసంగించారు.