Begin typing your search above and press return to search.

జయ జయహేపై ఆగని రగడ.. రెడ్డి లేనందునే అంటున్న మంద‌ కృష్ణ

బహుశా ఇటీవలి కాలంలో ఏ సినిమా పాట కూడా ఇంత వివాదాస్పదం కాలేదనుకుంటా.. అసలు అది సినిమా పాట కూడా కాదు

By:  Tupaki Desk   |   3 Jun 2024 12:06 PM GMT
జయ జయహేపై ఆగని రగడ.. రెడ్డి లేనందునే అంటున్న మంద‌ కృష్ణ
X

బహుశా ఇటీవలి కాలంలో ఏ సినిమా పాట కూడా ఇంత వివాదాస్పదం కాలేదనుకుంటా.. అసలు అది సినిమా పాట కూడా కాదు.. అంతకుమించిన ఓ రాష్ట్ర గేయం.. దీనివెనుక ఎన్నో ఉద్వేగాలు ఉన్నాయి.. ఉద్విగ్న క్షణాలూ ఉన్నాయి.. పదేళ్ల కిందట రాష్ట్రం ఏర్పడినా.. ఇప్పటికీ గేయం లేకపోవడం ఓ చిత్రమైతే.. కొత్తగా ఆమోదించిన గేయానికి అందించిన సంగీతం మరింత వివాదాస్పదం అవుతోంది.

ఉర్రూతలూగించలేదంటూ..

తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా అమల్లోకి వచ్చిన జయజయహే తెలంగాణలో ఉద్యమ కాలంనాటి ఉర్రూతలూగించే బాణీలు లేవనేది ప్రధాన విమర్శగా మారింది. ఇప్పటికే తెలంగాణ చిహ్నంపై వివాదం కొన‌సాగుతుండగా.. దానిపై నిర్ణయాన్ని పక్కనపెట్టారు. కానీ, ఆమోదం పొందిన జయజయహే కూడా మరింత వివాదం అవుతోంది. ఉద్యమకారులు, తెలంగాణ వాదులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అందెశ్రీ రాసిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీర‌వాణి సంగీతం అందించ‌డంపైనా అభ్యంతరాలు వచ్చాయి. ఆంధ్రాకు చెందిన వ్యక్తికి ఈ బాధ్యత అప్పగించడం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ‌తీశారనే విమ‌ర్శ‌లు రేగాయి. కానీ, క‌ళ‌కు ప్రాంతం, కులం, మతం ఆపాదించడాన్ని చాలామంది తప్పుబట్టారు. అది అలా సాగుతుండగానే.. జయజయహే తెలంగాణ గీతం ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమల్లోకి వచ్చింది.

రెడ్డి లేదని మిగతా పేర్లూ తీసేశారు..

జయజయహే గీతంపై తాజాగా ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగ స్పందించారు. అందెశ్రీ రాసిన గేయంలో సారం లేకుండా చేశార‌ని విమ‌ర్శించారు. స‌మ్మ‌క్క సార‌క్క‌, కొమ్రం భీమ్ పేర్లు ఏవీ అని ప్రశ్నించారు. కంచ‌ర్ల గోప‌న్న‌తో స‌హా క‌వుల పేర్లు గేయంలో ఎక్క‌డున్నాయ‌ని నిలదీశారు. ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గేయాన్ని ఆమోదించాల‌ని డిమాండ్ చేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన‌ట్టు విని అందెశ్రీ త‌న గౌర‌వం పోగొట్టుకున్నార‌ని మంద కృష్ణ మాదిగ విమ‌ర్శించారు. అందెశ్రీ పాట‌లో ‘‘రెడ్డి’’ప్ర‌స్తావ‌న లేద‌నే కార‌ణంతోనే మిగిలిన కులాల వారి పేర్ల‌ను కూడా తొల‌గించారని కొత్త పాయింట్ లేవనెత్తారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయజయహే రెండు వెర్షన్లనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. సంక్షిప్తంగా ఉన్నది 2.30 నిమిషాల నిడివితో సాగుతుంది. అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా ఈ నిడివితో రూపొందించారు. మొత్తం 12 చరణాలతో 13.30 నిమిషాల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేశారు.