ఎక్కడి మండవ? ఎక్కడి ఖమ్మం? తెరపైకి అనూహ్యంగా పేరు
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ మూడు లోక్ సభ సీట్లపై ఎటూ తేల్చడం లేదు. ఆయన కాదు ఈయన.. ఈయన కాదు ఆయన అంటూ సాగదీస్తోంది
By: Tupaki Desk | 9 April 2024 8:15 AM GMTతెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ మూడు లోక్ సభ సీట్లపై ఎటూ తేల్చడం లేదు. ఆయన కాదు ఈయన.. ఈయన కాదు ఆయన అంటూ సాగదీస్తోంది. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఇప్పటికిప్పుడు హడావుడి పడాల్సిన అవసరం లేదు. కానీ, రెండు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను తేల్చేసిన నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ముందంజ వేయాల్సిన అవసరం ఉంది.
ఆ గుమ్మంలో వలస నేతలు
తెలంగాణలోని మిగతా అన్ని జిల్లాల కంటే ఖమ్మం ప్రత్యేకత వేరు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈ జిల్లాలో పట్టు అంతంతమాత్రమే. మొదటినుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డా అయిన ఖమ్మంలో 2019లో మాత్రమే నెగ్గింది. అది కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలు నెగ్గిన ఊపులో మాత్రమే. ఇప్పుడు అధికారం 2009లో టీడీపీ, 2014లో వైసీపీ గెలుపొందాయి. మిగతా అన్నిసార్లూ కాంగ్రెస్, వామపక్షాలే నెగ్గాయి. అయితే, ఖమ్మం మరో ప్రత్యేకత ఏమంటే ఇతర జిల్లాల నుంచి వచ్చినవారిని ఏమాత్రం సంకోచం లేకుండా గెలిపించడం. ఇలానే పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు, రేణుకాచౌదరి ఇక్కడినుంచి విజయం సాధించారు.
ఈసారి ఆయన.?
తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వీటిలో ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి భార్య, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకుల నియోజకవర్గాలూ ఖమ్మం లోక్ సభ పరిధిలోనే ఉండడంతో పాటు బలమైన నాయకులు కావడంతో కాంగ్రెస్ ఏమీ తేల్చడం లేదు. ఇప్పుడు తాజాగా ఓ కొత్తపేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు. మండవ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఈయన పూర్వీకులు ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డారు. అయితే, మండవ పూర్తి నేపథ్యం తెలంగాణనే. అనూహ్యంగా ఆయనను కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిత్వానికి పరిశీలిస్తోంది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ లోకి
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా మండవ ఇంటికెళ్లి మరీ ఆయనను పార్టీలో చేర్చుకున్నారు బీఆర్ఎస్ అధినేత, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్. అంతకుముందు వరకు టీడీపీలోనే కొనసాగిన మండవ 20014 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా మండవతో సన్నిహితంగా మెలిగారు. తాజా అంచనాల ప్రకారం మండవకు కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ టికెట్ దక్కితే గనుక కాస్త సంచలనమే.
కొసమెరుపు: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మండవతో పాటు తీవ్రంగా పరిశీలిస్తున్న మరో పేరు రామసహాయం రఘురామిరెడ్డి. ఈ యన డోర్నకల్ దొరగా పేరుగాంచిన, వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు. మంత్రి పొంగులేటి, సినీ హీరో విక్టరీ వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు.