మంగళగిరి నేతన్న కళ.. చేనేతపై నారా ఫ్యామిలీ..
తాజాగా మంగళగిరి చేనేత కళాకారులు తమ కళాత్మకతను బయటపెట్టారు. ఒక వస్త్రంపై తమ అభిమాన నాయకుడు నారా లోకేశ్ కుటంబం ఫొటోను ముద్రించి ఆయనకు బహూకరించారు.
By: Tupaki Desk | 27 Feb 2025 6:15 AM GMTప్రత్యేక డిజైన్లు, సొగసులకు చేనేత వస్త్రాలు ప్రసిద్ధి. నాణ్యత, కళాత్మకత, హస్తకళ వంటివి మన చేనేత కార్మికుల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తాయి. ఎన్ని రకాల వస్త్రాలు వచ్చినా చేనేతకు సాటిరావు ఏవీ అంటారు. అగ్గిపెట్టెలో ఐదు గజాలు పట్టే చీరను అల్లడం మన చేనేత కార్మికుల ప్రతిభకు నిదర్శనం. మనదేశంలో కొన్ని లక్షల కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తుంటాయి. తాము నివసించే ప్రాంతాన్నే తమ బ్రాండ్ గా ప్రమోట్ చేసుకుంటూ వారు తయారు చేసే వస్త్రాలను మార్కెట్ చేస్తుంటారు. ఇక ఏపీలో యువనేత నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి కూడా చేనేత వస్త్రాలకు ప్రసిద్ది. ఎంతో ప్రతిభ గల కళాకారులకు కొదవలేదు అక్కడ. తాజాగా మంగళగిరి చేనేత కళాకారులు తమ కళాత్మకతను బయటపెట్టారు. ఒక వస్త్రంపై తమ అభిమాన నాయకుడు నారా లోకేశ్ కుటంబం ఫొటోను ముద్రించి ఆయనకు బహూకరించారు. ఆ వస్త్రాన్ని చూసి ముగ్ధుడైన లోకేశ్ తన ఎక్స్ అకౌంట్లో ఆ ఫొటోలను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, మంతి లోకేశ్, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చిత్రంతో కూడిన చేనేత వస్ర్తం అందరిని ఆకర్షిస్తోంది. లోకేశ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళగిరికి చెందిన చేనేత కళాకారుడు జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేశ్ కు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఓ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని భావించిన తండ్రీకొడుకులు ఇద్దరు చేనేత వస్త్రంపై లోకేశ్ కుటుంబం ఫొటోను చిత్రీకరించి బహూకరించారు. చేనేతపై తమ కుటుంబాన్ని చూసిన లోకేశ్ ముగ్ధుడయ్యారు. చేనేత కళాకారుల ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కళాకారుల సమస్యలను తెలుసుకున్న లోకేశ్.. మంగళగిరి చేనేత వస్త్రాలకు బ్రాండ్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు.