ఓటును రూ.5 వేలకు అమ్ముకొని అడ్డంగా బుక్.. మంగళగిరి ఎస్ఐ ఘనకార్యం!
ఎన్నికల నేపథ్యంలో అతన్ని మంగళగిరి టౌన్ స్టేషన్ కు బదిలీ చేశారు.
By: Tupaki Desk | 20 May 2024 5:01 AM GMTకక్కుర్తిలో మహా కక్కుర్తి అన్నట్లుగా ఉంటుందీ ఉదంతం. ఒక కీలక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ.. తన పోస్టల్ ఓటును రూ.5వేలకు అమ్ముకున్న వైనం సంచలనంగా మారింది. బాధ్యత కలిగిన అధికారికి మరీ ఇంత చిన్న బుద్ధా అన్నదిప్పుడు చర్చకు తెర తీసింది. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా బాబుది ప్రకాశం జిల్లా కురిచేడు.
ఎన్నికల నేపథ్యంలో అతన్ని మంగళగిరి టౌన్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇదిలా ఉంటే.. అతని సొంతూరైన కురిచేడులో ఓటు ఉంది. అతని ఓటు వేయిస్తానంటూ ఒక రాజకీయ పార్టీ నుంచి రూ.5వేలు తీసుకున్న ఒక పార్టీ నేత.. ఆన్ లైన్ లో ఎస్ఐకు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేశాడు. అతగాడు పోలీసులకు చిక్కటం.. విచారణలో భాగంగా తాను డబ్బులు పంపిణీ చేసిన వారిలో మంగళగిరి ఎస్ఐ కూడా ఉన్నట్లుగా తెలపటంతో పోలీసులు సైతం అవాక్కు అయ్యారు.
ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు శాఖా పరమైన చర్యలకు తెర తీశారు. తన పోస్టల్ ఓటును రూ.5వేలకు అమ్ముకున్న ఎస్ఐ ఖాజాబాబును సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి రిపోర్ట్ పంపారు. దీనిపై ఐజీ స్పందిస్తూ.. ఎస్ఐ ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ స్థాయిలో ఉండి.. రూ.5వేలకు ఓటును అమ్ముకోవాలన్న కక్కుర్తి ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.