Begin typing your search above and press return to search.

మద్దతు కోసం కాళ్లైనా పట్టుకుంటా... వీడియో వైరల్!

ప్రస్తుతం దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందడి నెలకొంది. దీంతో రకరకాల చిత్రాలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:47 AM GMT
మద్దతు కోసం కాళ్లైనా పట్టుకుంటా...  వీడియో వైరల్!
X

ప్రస్తుతం దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందడి నెలకొంది. దీంతో రకరకాల చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. సీట్ల కోసం పార్టీ నేతలతో పడుతున్న పట్లు, ఓట్ల కోసం ప్రజలతో చేస్తున్న చిత్రాలు వెరసి ఎన్నికల సందడే సందడి! ఈ క్రమంలో ఎన్నికల సీజన్ వచ్చిందంటే కనిపించే రెగ్యులర్ సన్నివేశాలన్నీ కనిపిస్తున్నాయి. పిల్లలను ఎత్తుకోవడాలు, దోసలు వేయడాలు, ప్రజలపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొవడాలు... ఇలా చాలానే జరుగుతున్నాయి. కాస్త రొటీన్ కి భిన్నంగా మద్దతు కోసం కాళ్లు పట్టుకున్న సంఘటన ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న రాజస్థాన్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు ప్రధాన పార్టీలూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో... కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కేటాయింపు ముసలం వైపు దారి తీస్తోంది. ఇందులో భాగంగా... గతంలో సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పుడు ఆయన వెంట ఉన్న కొందరికి కాంగ్రెస్‌ అధిష్టానం ఈదఫా టికెట్లు నిరాకరించింది.

దీంతో రచ్చ మొదలైంది. ఇందులో భాగంగా నాటి రెబల్ అభ్యర్థుల వాళ్ల అనుచరులు ఆందోళనలకు దిగారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ముసలమే వచ్చేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు.. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు పట్టుకోబోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. రాజకీయాలంటే అట్లుంటది మరి అనే కామెంట్లు పెట్టడం నెటిజన్ల వంతైంది!

వివరాళ్లోకి వెళ్తే... గతంలో కాంగ్రెస్ పార్టీలో సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో తిరుగుబ్బాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అధిష్టానాన్ని దిక్కరిస్తూ ఆయన వెంట కొంతమంది రెబల్స్‌ నడిచారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. దీంతో వారిలో కొందరికి ఈదఫా టికెట్లు నిరాకరించింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఫలితంగా... ఎమ్మెల్యే జోహారీలాల్‌ మీనాకు టిక్కెట్ నిరాకరించింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

రాజ్‌ గఢ్‌ - లక్ష్మణ్‌ గఢ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోహారీలాల్‌ మీనాను కాదని.. తాజాగా రిటైర్డ్‌ అయిన ప్రభుత్వ అధికారి మంగీలాల్‌ మీనాకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. దాంతో.. ఇదే స్థానం నుంచి టికెట్‌ ఆశించిన రాహుల్‌ మీనా భంగపడ్డారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాహుల్‌ మీనా.. తాజాగా మూడో జాబితా ప్రకటన తర్వాత రాజస్థాన్‌ కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమైన ఆయన... తన ఆవేదనను వెలిబుచ్చుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆ సమావేశం కొనసాగుతుండగానే అక్కడికి వచ్చిన మంగీలాల్‌ తనకు అండగా నిలవాలని మోకాళ్లపై కూర్చొని రాహుల్‌ ను వేడుకున్నారు. ఒక సోదరుడిలా భావించి తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన కాళ్లు పట్టుకోబోయారు! రాహుల్‌ ఒకింత ఇబ్బందికి గురై.. పాదాలను తాకకుండా మంగీలాల్‌ ను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది