మంగ్లీకి స్పెషల్ దర్శనం.. టీడీపీ సోషల్ మీడియా ఫైర్!
ప్రస్తుత పొలిటికల్ అట్మాస్పియర్ లో నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Feb 2025 10:15 AM GMTఅరసవల్లి రథసప్తమి వేడుకల్లో ప్రముఖ గాయని మంగ్లీకి ప్రోటోకాల్ దర్శనం కల్పించడంపై టీడీపీ సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. తన నోటితో చంద్రబాబు పేరు పలకనని చెప్పడమే కాకుండా, జగనన్న అభిమానినంటూ చెప్పుకున్న మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి తీసుకువెళ్లడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఎస్వీబీసీలో పదవి తీసుకుని, ఆ పార్టీతో అనుబంధం కొనసాగించిన మంగ్లీకి రాచమర్యాదలు ఎందుకంటూ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత పొలిటికల్ అట్మాస్పియర్ లో నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా నాయకుల ప్రతి అడుగును కార్యకర్తలు వేయి కళ్లతో గమనిస్తున్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి విషయంలో ఎవరు మెతకగా వ్యవహరించినా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.
గత నెలలో నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వైసీపీ నేత జోగి రమేశ్ వేదిక పంచుకోడాన్ని టీడీపీ సోషల్ మీడియా తీవ్రంగా తప్పుబట్టింది. ఇద్దరు నేతలను మాటల తూటాలతో దుమ్ము దులిపింది. దీంతో తప్పైపోయిందని ఆ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాల్సివచ్చింది.
ఇక తాజాగా మంగ్లీ విషయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అదే తప్పు చేశారంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన మంగ్లీతో శ్రీకాకుళంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, రథసప్తమి సందర్భంగా సూర్యదేవుడి దర్శనానికి తన కుంటుంబంతో కలిసి మంగ్లీని తీసుకువెళ్లడాన్ని సోషల్ సైనికులు విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీపైన, చంద్రబాబుపైన మంగ్లీ ఆడిన మాటలను గుర్తు చేస్తూ కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. మంగ్లీ వంటివారికి ప్రాధాన్యమివ్వడం కార్యకర్తలను హేళన చేయడం కాదా? అంటూ పోస్టులు పెడుతున్నారు. రెండు రోజులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తూ పోస్టుల యుద్ధం చేయడం టీడీపీలో వేడి పుట్టిస్తోంది. ఈ పోస్టింగులపై కేంద్ర మంత్రి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.