ఇక, మేనిఫెస్టో ముచ్చట.. ఒకరిని మించి ఒకరు?!
దీనిని బట్టి తెలంగాణ లోనూ ప్రధాన మూడు పార్టీలూ పోటీ పడి మరీ.. ఉచితాల వైపు మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
By: Tupaki Desk | 6 Nov 2023 12:30 PM GMTతెలంగాణలో కాకరేపుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక, మిగిలింది.. మేనిఫెస్టో ముచ్చటే. ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు.. అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేశారు. మూడో జాబితాలు రావాల్సి ఉన్నా.. వాటిపై పెద్దగా ఫోకస్ లేదు. మెజారిటీ స్థానాలను ఎనౌన్స్ చేసిన దరిమిలా.. ఇప్పుడు ప్రచారం పైనే నాయకులు, పార్టీలు దృష్టి పెట్టారు. ఇక, నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైపోయింది. ప్రజల మధ్యకు నాయకులు పోటెత్తుతున్నారు.
ఇదిలావుంటే.. పార్టీలు మేనిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రజలకు కొన్ని హామీలు గుప్పించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా.. ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. బీజేపీ వంతు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే.. అటు బీఆర్ ఎస్ ప్రకటించినవైనా.. ఇటు కాంగ్రెస్ వెల్లడించినవైనా.. మచ్చుకు టేస్ట్ మాత్రమే! అసలు వండి వార్చే హామీలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఇక, బీజేపీ అయితే.. ఇంకా ఏమీ దీనిపై దృష్టి పెట్టినట్టుగా కూడా లేదు. కానీ, ప్రధాని మోడీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. గిరిజన యూనివర్సిటీ సహా కొన్ని హామీలు ఇచ్చారు. ఇవి కూడా కేవలం మచ్చుకు మాత్రమే. కాబట్టి.. మూడు ప్రధాన పార్టీలు కూడా మేనిఫెస్టో ముచ్చటపైనే ఎక్కువగా ఫోకస్ పెంచాయి. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఉచితాలకు వ్యతిరేకమనే బీజేపీ కూడా.. తాజా ఎన్నికల్లో ఉచితాలవైపే మొగ్గు చూపుతోంది.
ఛత్తీసగఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ రెండు రోజుల కిందట ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు ఏటా 12 వేల చొప్పున ఆర్థిక సాయం, యువతకు ఉచిత బస్ ప్రయాణం, మహిళలకు ఉచితాలు.. ఇలా ఉచితాలకే మొగ్గు చూపింది. సో.. దీనిని బట్టి తెలంగాణ లోనూ ప్రధాన మూడు పార్టీలూ పోటీ పడి మరీ.. ఉచితాల వైపు మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.