దర్శకుడి ఇంట్లో కొట్టేసిన జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేసిన దొంగలు
దీనికి సంబంధించిన వార్తలు పబ్లిష్ కావటం.. జాతీయ అవార్డు చోరీ కావటంపై సదరు దర్శకుడు మణికంఠన్ విచారం వ్యక్తం చేయటం జరిగింది
By: Tupaki Desk | 14 Feb 2024 5:00 AM GMTసినిమాటిక్ సీన్ ఒకటి తాజాగా తమిళ దర్శకుడు రియల్ లైఫ్ లో చోటు చేసుకుంది. తమిళ చిత్రాల ప్రముఖ దర్శకుడు మణికంఠన్ ఇంట్లో కొద్ది రోజుల క్రితం దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. కాక్కా.. ముట్టై.. కడైసి వివసాయి సినిమాలకు ఆయనకు జాతీయ అవార్డులు లభించాయి. దొంగలు ఆయన ఇంట్లో రూ.లక్ష నగదుతో పాటు.. కాసింత బంగారు ఆభరణాలతో పాటు జాతీయ అవార్డుల్ని దోచేశారు.
దీనికి సంబంధించిన వార్తలు పబ్లిష్ కావటం.. జాతీయ అవార్డు చోరీ కావటంపై సదరు దర్శకుడు మణికంఠన్ విచారం వ్యక్తం చేయటం జరిగింది. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. తాము దొంగలించిన జాతీయ అవార్డుల విషయంలో సదరు దొంగలు పునరాలోచనలో పడినట్లున్నారు. అందుకేనేమో తాజాగా సదరు దర్శకుడి ఇంటి బయట ఒక ప్లాస్టిక్ కవర్ లో తాము కొట్టేసిన జాతీయ అవార్డులను పెట్టేసి.. తమను క్షమించాలని కోరుతూ పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
మధురై జిల్లాలోని ఉసిలంపట్టిలోని మణికంఠన్ నివాసంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆయనింట్లో జరిగిన దొంగతనంపై పోలీసులు విచారిస్తున్న వేళ.. ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. డబ్బు.. బంగారం పోతే ఫర్లేదు.. జాతీయ పురస్కారం పోయినందుకు విచారపడుతున్న మణికంఠన్ వేదనను అర్థం చేసుకున్నట్లుగా దొంగల తీరు ఉందంటున్నారు. తన ఇంటి బయట దొంగలించిన పురస్కారాల్ని పెట్టేసి వెళ్లటం ఒక ఎత్తు అయితే.. తమను క్షమించమని కోరుతూ లేఖ రాసిన వైనం చూసినోళ్లు.. వీళ్లెవరో మంచి దొంగలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.