Begin typing your search above and press return to search.

ఢిల్లీ దక్కింది...మణిపూర్ చెదిరింది !

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వరకూ చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం పట్ల విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 Feb 2025 2:45 AM GMT
ఢిల్లీ దక్కింది...మణిపూర్ చెదిరింది !
X

భారతీయ జనతా పార్టీకి అంతా ఘనం అని చెప్పుకుంటున్న వేళ దేశమంతా కాషాయ ప్రభలు దివ్యంగా వెలిగిపోతాయని భావిస్తున్న వేళ ఇంకేముంది మొత్తం దేశం బీజేపీ ఏలుబడిలోకి వస్తోంది అన్న ఆశలు నిండుగా చిగురించిన వేళ మణిపూర్ కలలు చెదిరిపోయాయి. అత్యంత అనివార్య పరిస్థితుల్లో బీజేపీ అక్కడ తన అధికారాన్ని పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేత రాజీనామా చేయించింది. ఆ వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టింది.

ఇదంతా కూడా బీజేపీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరోలాగే ఉంది అని అంటున్నారు. బీజేపీ 2017 నుంచి మణిపూర్ లో అధికారంలో ఉంది. 2022లో ఇదే ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ గెలిచింది. మొత్తం అరవై అసెంబ్లీ సీట్లకు గానూ 32 ఆ పార్టీ సొంతం చేసుకుని మ్యాజిక్ ఫిగర్ ని సాధించింది. ఇక మిత్రులు అంతా కలసి మద్దతు ఇవ్వడంతో బలం ఏకంగా 44 పైగా చేరుకుంది.

అయితే ఈ మధ్యనే జేడీయూ మణిపూర్ లోని ఎన్డీయే ప్రభుత్వానికి తన మద్దతుని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పింది. అయితే అది లోకల్ గా తీసుకున్న నిర్ణయం అని జేడీయూ జాతీయ నాయకత్వం సర్దుబాటు చేసి ఉండొచ్చి ఉండొచ్చు కానీ బీజేపీ ఏలుబడి మీద సొంత కమలం పార్టీలోనే వ్యతిరేకత వస్తున్న వేళ మిత్ర పక్షం అలా దూరం జరగడంతో ఆశ్చర్యం ఏముంటుంది అని అంటున్నారు.

ఇక బీజేపీ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు అక్కడ రెండు తెగల మధ్య సంఘర్షణ జరుగుతున్నపుడు ఒక వైపు మాత్రమే మద్దతుగా నిలబడ్డారు అన్న విమర్శలు ఉన్నాయి. 2023 రెండవ అర్ధ భాగం నుంచి అలా మణిపూర్ రగులుతున్నా కేంద్ర బీజేపీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ అనుకున్న స్థాయిలో స్పందించలేదు అన్న విమర్శలు కూడా విపక్షాలు చేస్తూ వచ్చాయి.

ఇంకో వైపు చూస్తే మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని మూకుమ్మడిగా అక్కడ విపక్షాలు డిమాండ్ చేశాయి. అదే విధంగా బీరేన్ సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అది నిజంగా కనుక చర్చకు వస్తే బీజేపీకి చెందిన వారు కూడా విప్ ని ధిక్కరించి మరీ అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించేందుకు సిద్ధపడి పోయారు అన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

అంటే మణిపూర్ సంక్షోభం ఎంత స్థాయిలో ఉందో ఆఖరుకు అధికార బీజేపీలో కూడా చీలిక తెచ్చేలా అది ఎగబాకిందో అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఈ విపత్కర పరిణామాల నేపథ్యంలోనే మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ తో బొటాబొటీగా ఉన్న బీజేపీ బలం కూడా రాష్ట్రపతి పాలన పెట్టడానికి మరో కారణంగా మారింది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వరకూ చూసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం పట్ల విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఒక విధంగా ఇది విపక్షాల పోరాటానికి దక్కిన విజయంగా చెబుతున్నారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టమని విపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వచ్చాయి.

అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ సున్నితమైన అంశాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్లనే మణిపూర్ మండిపోయింది అని అంటున్నారు. అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. అందులో కికీ మైతేయి వర్గాల మధ్య భీకరమైన సమరమే సాగుతోంది. ఇప్పటికి అయితే వందలాది మంది చనిపోయారు. అయినా కానీ సరైన సమయంలో కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకోలేదని విపక్షాలు విమర్శించాయి.

ఎట్టకేలకు కేంద్రం మణిపూర్ విషయంలో కీలక దిశగా అడుగులు వేసింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం నేరుగా అక్కడ లా అండ్ ఆర్డర్ ని సమీక్షించనుంది. అవసరమైన చర్యలు తీసుకోనుంది. అయితే మరో రెండేళ్ళ పాటు బీజేపీకి అధికారం ఉంది. మణిపూర్ లో శాంతి భద్రతలు దారికి వచ్చిన తరువాతనే కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసి ప్రమాణం చేయిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఢిల్లీ దక్కింది. మణిపూర్ చెదిరింది అన్నట్లుగానే పరిస్థితి ఉంది అని అంటున్నారు.