Begin typing your search above and press return to search.

అల్లర్ల వేళ మణిపూర్ సీఎం మాటల ఆడియో లీక్

ఈ వాదనకు బలాన్ని చేకూర్చేలా ఒక ఆడియో లీకైంది. అందులో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.. మౌఖిక ఆదేశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:40 AM GMT
అల్లర్ల వేళ మణిపూర్ సీఎం మాటల ఆడియో లీక్
X

షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. రాష్ట్ర పాలకుడిగా.. ముఖ్యమంత్రిగా ఉంటూ హింసాగ్నిని చల్లార్చేందుకు.. శాంతిభద్రతల్ని కాపాడేందుకు తహతహలాడాల్సిన వేళ.. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ.. వారి పట్ల సానుకూలతను వ్యక్తం చేసిన వైనం వెలుగు చూసింది. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య నెలకొన్న వైషమ్యాలు.. హింస తెలిసిందే. జాతుల మధ్య హింసాకాండ చెలరేగే వేళలో.. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చర్యలు మరింత హింసను పెంచేలా చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ వాదనకు బలాన్ని చేకూర్చేలా ఒక ఆడియో లీకైంది. అందులో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.. మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. ‘‘ప్రభుత్వకార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయిలకు అవకాశం ఇవ్వండి’’ అంటూ ఆదేశాలు జారీ చేసిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలోని గొంతు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గొంతుకు 93 శాతం సరిపోయినట్లుగా హైదరాబాద్ కు చెందిన ట్రూత్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లుగా బయటకు వచ్చింది.

ఈ రిపోర్టును సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టుకు ఈ సంచలన విషయాల్ని వెల్లడించటంతో అందరూ షాక్ తిన్న పరిస్థితి. అయితే.. ఈ నివేదికను మణిపూర్.. కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పరిశీలన జరగాలని.. మూడు వారాలు గడువు కావాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. సీల్డ్ కవన్ లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.

గత ఏడాది మే మూడు నుంచి మణిపూర్ లోని మైదాన ప్రాంతాలకు చెందిన మైత్రేయులు.. కొండ ప్రాంతాలకు చెందిన కుకీలకు మధ్య ఘర్షణలు జరగటం.. 200 మంది మరణించటం తెలిసిందే. ఈ హింసతో దాదాపు 70 వేలమంది పౌరులు నిరాశ్రయులయ్యారు. జాతుల మధ్య వైరానికి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా ఆడియో క్లిప్ ను కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యుమన్ రైట్స్ ట్రస్ట్ అప్పట్లో సుప్రీంను ఆశ్రయించింది. వీరి తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ ఒకరు.

ఆడియోలో ఉన్న వాయిస్.. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వాయిస్ కు 93 శాతం మ్యాచ్ అయినట్లుగా నివేదిక ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం మరోలా ఉంది. ఈ కేసును మణిపూర్ హైకోర్టు విచారించాలని ఆయన కోరుతున్నారు. దీనికి స్పందించిన సుప్రీం ధర్మాసనం.. కేసును మేము విచారించాలా? మణిపూర్ హైకోర్టా? అనేది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కేసు విచారణ ఎక్కడ జరగాలనే దానికంటే అందరిని సమానంగా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నేత.. అందుకు భిన్నంగా ఒక వర్గానికి కొమ్ముకాయటం.. మరో వర్గం మీద కత్తులు దూసే పరిస్థితి దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.