ఎన్డీయేకు షాక్ ఇచ్చిన జేడీయూ...ఏం జరుగుతోంది ?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మనుగడ పూర్తిగా ఏపీలోని టీడీపీ బీహార్ కి చెందిన జేడీయూ పార్టీ మీదనే ఆధారపడి ఉంది అన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jan 2025 3:00 AM GMTకేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మనుగడ పూర్తిగా ఏపీలోని టీడీపీ బీహార్ కి చెందిన జేడీయూ పార్టీ మీదనే ఆధారపడి ఉంది అన్నది తెలిసిందే. ఈ రెండు పార్టీలను ఊతకర్ర గా చేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే టీడీపీ వరకూ ఓకే అయినా జేడీయూ విషయంలో మాత్రం కొంత వరకూ ఆలోచించాల్సిందే అని అంతా అంటున్న నేపధ్యం ఉంది.
ఎందుకంటే జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయ స్థిరత్వం మీద కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. అది కేంద్రంలో ఎన్డీయేకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇంతకీ ఏమి జరిగింది అంటే బీజీపీ నాయకత్వంలో మణిపూర్ రాష్ట్రంలో ఏర్పాటు అయిన ఎన్డీయే ప్రభుత్వం నుంచి జేడీయూ బయటకు రావడం. తాము ఎన్డీయేలో ఉండదలచుకోలేదని స్పష్టం చేస్తూ అక్కడ సీఎం బీరెన్ సింగ్ కి జేడీయూ నేతలు లేఖ రాశారు. దీంతో మణిపూర్ ఎన్డీయేకు గట్టి షాక్ తగిలినట్లు అయింది.
నిజానికి చూస్తే మణిపూర్ లో జేడీయూ మద్దతు ఉపసంహరణకు ఆ రాష్ట్రానికే పరిమితం అన్నట్లుగా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. జేడీయూ రాజకీయ వైఖరి మారుతోందా అన్న అతి పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఇది ఉందని అంటున్నారు.
అయితే ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం అని జేడీయూ జాతీయ నాయకత్వం అంటోంది. మణిపూర్ జేడీయూ నేతలు స్థానికంగా తీసుకున్న నిర్ణయం అని హైకమాండ్ ని సంప్రదించలేదని కూడా చెబుతోంది. తాము మాత్రం కేంద్ర స్థాయిలో బీజేపీకి మద్దతు ఇస్తామని తాము ఎన్డీయేతో పాటే ఉంటామని జాతీయ జేడీయూ నాయకత్వం స్పష్టం చేసింది.
అక్కడితో ఆగకుండా జేడీయూ హైకమాండ్ స్థానికంగా ఉన్న తమ పార్టీ జేడీయూ రాష్ట్ర పార్టీ అధినేతను పదవి నుంచి కూడా తొలగించింది. అయితే ఆయన తనకు తానుగా సొంతంగా లేఖ విడుదల చేయడం మాత్రం బీజేపీకి షాక్ గా మారింది అని అంటున్నారు
అయితే జేడీయూ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్ లో ఎన్డీయేకు తమ మద్దతు కొనసాగుతుందని ఒట్టేసి మరీ చెబుతోంది. ఇక చూస్తే కనుక మణిపూర్ అసెంబ్లీలో జేడీయూకి ఆరు సీట్లు ఉండగా బీజేపీకి 32 ఉన్నాయి. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీని నడపగలిగేంత శక్తి అక్కడ బీజెపీకి ఉంది. అయితే కేంద్రం స్థాయిలో కూడా బీజేపీకి మాత్రం జేడీయూ మద్దతు అవసరం కావడంతో మణిపూర్ లో జేడీయూ నేతలు చేసిన పని మాత్రం కాషాయ దళానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు.
ఎందుకంటే ఇది లోకల్ గా జేడీయూ నేతలు తీసుకున్న నిర్ణయమేనా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కేంద్రంలోని బీజేపీని ఈ చర్య ఉలికిపాటుకు గురి చేసింది. బీజేపీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది అంటున్నారు.