Begin typing your search above and press return to search.

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్ జెట్స్!

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ లోని ఇంఫాల్ విమానాశ్రయంలో సుమారు మూడు గంటలపాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:24 PM GMT
ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు కలకలం.. రంగంలోకి  దిగిన రఫేల్  జెట్స్!
X

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ లోని ఇంఫాల్ విమానాశ్రయంలో సుమారు మూడు గంటలపాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయం సమీపంలో గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగురుతూ కనిపించింది. దీంతో ఆ వస్తువును గుర్తించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు తీవ్రంగా గాలించాయి! దీంతో విమానాశ్రయ అధికారులు వెంటనే మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ లోని "నియంత్రిత గగనతలం"ను మూసివేశారు.

అవును... ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో ఆకాశంలో గుర్తుతెలియని వస్తువు కనిపించి కలకలం సృష్టించింది. దీంతో ఈ సమయంలో రెండు విమానాలను ఒకటి కోల్‌ కతా, మరొకటి గౌహతి వైపు మళ్లించారు. ఆ తర్వాత అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. అనంతరం ఐఏఎఫ్‌ రెండు రఫేల్‌ ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించింది.

ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో.. ఎయిర్‌ పోర్టు వద్ద ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించింది. దీంతో సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది వెంటనే.. ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కి సమాచారమిచ్చారు. ఇదే సమయంలో అప్రమత్తమైన ఏటీసీ.. ముందు జాగ్రత్తగా ఈ ఎయిర్‌ పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఈ విషయాలపై రక్షణశాఖ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

ఇందులో భాగంగా... ఇంఫాల్‌ ఎయిర్‌ పోర్టు వద్ద గుర్తుతెలియని వస్తువు గురించి సమాచారం అందగానే.. సమీపంలోని ఎయిర్‌ బేస్‌ నుంచి ఓ రఫేల్ యుద్ధ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంపించిందని... అడ్వాన్స్‌డ్‌ సెన్సర్లు కలిగిన ఈ అధునాతన ఫైటర్‌ జెట్‌.. ఆ వస్తువు కోసం గాలించినా ఎక్కడా అలాంటి వస్తువు కన్పించలేదని తెలిపాయి.

అయితే ఆ తర్వాత కాసేపటికి మరో రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ ను కూడా ఐఏఎఫ్ పంపించిందని తెలిపింది. ఆ సమయంలో కూడా ఎలాంటి గుర్తుతెలియని వస్తువు కనిపించలేదని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఇంఫాల్ ఎయిర్‌ పోర్టు ప్రాంతాల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ రెస్పాన్స్‌ మెకానిజం ను యాక్టివేట్‌ చేసినట్లు భారత వాయుసేన ఈస్ట్రన్‌ కమాండ్‌ వెల్లడించింది. ఆ తర్వాత ఎలాంటి వస్తువూ కనిపించలేదని తెలిపింది.

కాగా... పశ్చిమ బెంగాల్‌ లోని హషిమారా ఎయిర్‌ బేస్‌ వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను మోహరించి ఉంచింది. ఇవి తరచూ తూర్పు సెక్టార్‌ లోని చైనా సరిహద్దు వెంబడి గస్తీ కాస్తుంటాయి. ఇటీవల చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ చేపట్టిన మెగా వాయుసేన విన్యాసాల్లోనూ రఫేల్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇవి చాలా అధునాతన యుద్ధ విమానాలు!