Begin typing your search above and press return to search.

మణిపూర్ లో రెండు భిన్న డిమాండ్లు.. మోడీ నిర్ణయం ఎటు?

మణిపూర్ రాష్ట్రంలో గతంలో జరిగిన అల్లర్లు, అరాచకాలు, దారుణాలు, ఘోరాల గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:26 AM GMT
మణిపూర్  లో రెండు భిన్న డిమాండ్లు.. మోడీ నిర్ణయం ఎటు?
X

మణిపూర్ రాష్ట్రంలో గతంలో జరిగిన అల్లర్లు, అరాచకాలు, దారుణాలు, ఘోరాల గురించి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగానూ చర్చనీయాంశం అయిన పరిస్థితి. ఆ ఘోరాల తాలూకు నీడలు, గుర్తులు, మరకలు ఇంకా స్పష్టంగా ఉన్నాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కుకీ జో తెగ సంఘాలు మణిపూర్ లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి.

అవును... మణిపూర్ లోని కొండప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో కుకీ జో తెగ సంఘాలు తాజాగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. .ఈ సందర్భంగా... మణిపూర్ లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలకాలని.. ఇదే సమయంలో తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఆ తెగ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయాలపై ప్రధాని స్పందించాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తమ డిమాండ్ ల పరిష్కారాలను వేగవంతం చేయాలని కోరుతూ... కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు మెమరాండం సమర్పించినట్లు కుకీ జో తెగ సంఘాల జిల్లా అధికారులు చెబుతున్నారు.

వీరి సంగతి అలా ఉంటే... మరోపక్క వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి! ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. "ప్రత్యేక పరిపాలనా వద్దు.. గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేయొద్దు" అనే నినాదాలతో ర్యాలీ చేశారు. దీంతో.. ఈ విషయంపై ప్రధాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

కాగా... గత ఏడాది మే నుంచి మణిపూర్ లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగకు.. పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగకు మధ్య తీవ్రస్థాయిలో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు హింసాత్మక ఘటనలుగా మారడంతో సుమారు 220 మంది మృతి చెందరు.. వేలాది మంది గాయపడ్డారు.. చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు!