Begin typing your search above and press return to search.

మణిపూర్ పై కుట్ర జరుగుతోందా ?

రెండున్నర నెలలైనా మణిపూర్లో అల్లర్లు ఆగకుండా ఇంకా జరుగుతునే ఉన్నాయంటే ఇందులో కుట్రకోణం ఉందేమోననే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   24 July 2023 6:26 AM GMT
మణిపూర్ పై కుట్ర జరుగుతోందా ?
X

రెండున్నర నెలలైనా మణిపూర్లో అల్లర్లు ఆగకుండా ఇంకా జరుగుతునే ఉన్నాయంటే ఇందులో కుట్రకోణం ఉందేమోననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రిజర్వేషన్లు మూలకారణంగా మొదలైన గొడవ ఇప్పటికీ సద్దుమణగకపోవటమే విచిత్రంగా ఉంది. మామూలుగా ఏ అంశంపైనైనా రెండు వర్గాల మధ్య వివాదం మొదలైతే రెండు మూడు రోజులు, లేదంటే వారం పది రోజుల్లో ఆగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సర్దిచెబుతుంది కాబట్టి గొడవలు ఆగిపోతాయి.

కానీ మణిపూర్లో మాత్రం ఒకవైపు ప్రభుత్వం సర్దిచెబుతోంది, గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా అల్లర్లు ఆగకపోగా మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా కుకీలకు చెందిన ఇద్దరు మహిళల బట్టలూడదీసి రోడ్లలో నడిపించటంతో అల్లర్లు మరోసారి భగ్గుమన్నాయి. కుకీ-మొయితీ తెగల మధ్య రిజర్వేషన్ల గొడవ మొదలైన విషయం తెలిసిందే. తమకు కూడా గిరిజన రిజర్వేషన్లు కల్పించాలని కుకీలు చేసిన డిమాండ్లే గొడవలకు ఆజ్యంపోసింది.

కుకీల డిమాండ్లను మొయితీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో మొయితీ, కుకీల మద్దతుదారులు ఒకళ్ళ ఇళ్ళపై మరొకళ్ళు దాడులు చేసుకున్నారు. అల్లర్లను అదుపు చేయటంలో కానీ అల్లర్లలో కానీ సుమారు 200 మంది చనిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రమంతా కర్ఫ్యూపెట్టింది. అయినా అల్లర్లు ఆగకపోవటమే విచిత్రంగా ఉంది. ఈ నేపధ్యంలోనే కొందరు గుర్తు తెలియని జనాలు కేంద్రమంత్రి ఇంటిని కూడా తగలబెట్టేశారు. చెదురుమదురు ఘటనలు జరుగుతునే ఉన్నా గొడవలు ఒక కొలిక్కి వస్తున్నాయనే అందరు అనుకున్నారు.

అయితే హఠాత్తుగా ఇద్దరు కుకీ మహిళ బట్టలూడదీసి రోడ్డుపై నడిపించటంతో మళ్ళీ అల్లర్లు మొదలయ్యాయి. మొయితీల ఇళ్ళపై ఒక్కసారిగా దాడులు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో గతంలో కుకీల మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు బయటపడింది. దాంతో కుకీలు మరింతగా రెచ్చిపోతున్నారు. ఫలితంగా మొయితీలు రాష్ట్రాన్ని వదిలేసి అస్సాలోకి పారిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే కావాలనే ఎవరో కుట్రలు చేసి అల్లర్లు ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ఒకవైపు పాకిస్ధాన్ మరోవైపు బంగ్లాదేశ్, అలాగే చైనా దేశాల కన్ను మణిపూర్ పై ఉంది. మరే దేశం మణిపూర్ అల్లర్ల వెనకుందో కేంద్ర నిఘావర్గాలే తేల్చాలి.