Begin typing your search above and press return to search.

ఇవ్వాళ్టికి 4 నెలలు.. మణిపూర్ లో మళ్లీ హింసాజ్వాల

ఇళ్లకు నిప్పు సామూహిక అత్యాచారాలు దాడులు ఇలా అనేకం వెలుగుచూస్తున్నాయి

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:09 AM GMT
ఇవ్వాళ్టికి 4 నెలలు.. మణిపూర్ లో మళ్లీ హింసాజ్వాల
X

సరిగ్గా నాలుగు నెలలవుతోంది. ఆ రాష్ట్రం రగులుతూనే ఉంది. నాటి నుంచి హింస చెలరేగుతూనే ఉంది. మధ్యలో శాంతి ప్రయత్నాలు చేసినా.. అవి నిష్ఫలమే అయ్యాయి. ఆ రాష్ట్ర సమస్యపై పార్లమెంటు 15 రోజులుగా అట్టుడుకుతూనే ఉంది. ప్రధాని మోదీ నోరిప్పాలంటూ ప్రతిపక్షాలు గొంతెత్తుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో గత నెల 19న వెలుగులోకి వచ్చింది మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటిగా పరిణామాలు. ఇళ్లకు నిప్పు.. సామూహిక అత్యాచారాలు.. దాడులు ఇలా అనేకం వెలుగుచూస్తున్నాయి.

మార్చురీలో 35 డెడ్ బాడీలు..

ఒకటి రెండు కాదు మణిపూర్ అల్లర్లలో చనిపోయిన 35 మంది డెడ్ బాడీలు దాదాపు నాలుగు నెలలుగా మార్చురీల్లో పడి ఉన్నాయి. వారిని సామూహిక ఖననం చేయడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాచేస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, హైకోర్టు జోక్యం చేసుకుని సర్దిచెప్పాయి. కాగా, జూన్ నెలలో మణిపూర్ లో ఒక్క రోజే 40 మందిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు. దీన్నిబట్టి మణిపూర్ లో జాతుల ఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. కాగా, శుక్రవారం అర్ధరాత్రి మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు మృతిచెందడం మళ్లీ హింసకు దారితీసింది. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

విష్ణుపూర్ జిల్లాలోనే

మణిపూర్ అల్లర్లు మొదలైన దగ్గరనుంచి వినిపిస్తున్న పేర్లు విష్ణుపూర్, చురాచాంద్ పూర్. ఇప్పుడు విష్ణపూర్ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ హింస చెలరేగింది. మృతులు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందినవారని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వీరు ఇళ్లకు పహారాలో ఉండగా గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో తండ్రీ కుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారు. అయితే, నిందితులను మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల బఫర్‌ జోన్‌ను దాటుకుని దుండగులు గ్రామంలోకి రావడం.. కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మళ్లీ కలకలం..

కాల్పుల ఘటనతో క్వాక్టాలో ఉద్రిక్తతలు మరోసారి పెచ్చరిల్లాయి. సేపటికే ఈ ప్రాంతంలో కుకీల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో భీకర కాల్పులు జరిగాయని సమాచారం. క్వాక్టాలో పరస్పర కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో కమాండో ఒకరు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక క్వాక్టాలో పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. విష్ణుపుర్‌లో పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

లూటీ చేసిన ఆయుధాలతోనే దాడి..?

విష్ణుపుర్‌లో గురువారం రాత్రి అల్లరిమూకలు తెగబడ్డాయి. ఆయుధాలను లూటీ చేశాయి. నారన్సీనా ప్రాంతంలో రిజర్వు బెటాలియన్‌ ప్రధాన కార్యాలయంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీగా ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లాయి. రెండు రోజుల క్రితం భద్రతాబలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని 17 మంది గాయపడ్డారు. కాగా, లూటీ చేసిన ఆయుధాలతోనే దాడులకు తెగిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.