Begin typing your search above and press return to search.

నేపాల్ లో రగులుతున్న హిందూ దేశం వివాదం.. బాలీవుడ్ హీరోయిన్ మద్దతు

హిమాలయ దేశం నేపాల్.. ప్రంపంచలో ఏకైక హిందూ దేశం కొన్నాళ్ల కిందట వరకు.. అక్కడ రాచరికం ఉండేది. అయితే, దీనిని రద్దుచేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది.

By:  Tupaki Desk   |   30 March 2025 1:30 PM
నేపాల్ లో రగులుతున్న హిందూ దేశం వివాదం.. బాలీవుడ్ హీరోయిన్ మద్దతు
X

హిమాలయ దేశం నేపాల్.. ప్రంపంచలో ఏకైక హిందూ దేశం కొన్నాళ్ల కిందట వరకు.. అక్కడ రాచరికం ఉండేది. అయితే, దీనిని రద్దుచేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, కొన్నాళ్లుగా మళ్లీ నేపాల్ లో ఆందోళనలు మొదలయ్యాయి. రాచరికం పునరుద్ద‌రించాలంటూ కొన్ని రోజులుగా భారీఎత్తున‌ నిరసనలు కొన‌సాగుతున్నాయి.

వాస్తవానికి గత ఏడాది నేపాల్ లో ప్రభుత్వం మారింది. ప్రచండ రాజీనామా చేసి కేపీ శర్మ ఓలీ అధికారంలోకి వచ్చారు. శర్మ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు హిందూ రాష్ట్రం డిమాండ్ వైపు వెళ్లాయి. నిరసనకారుల్లో చాలామంది దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ చేశారు.

2008లో నేపాల్‌ లో రాచరిక వ్యవస్థను రద్దు చేశారు. దీనికి 239 సంవత్సరాలు రాచరిక వ్య‌వ‌స్థ కొన‌సాగింది. చివరి రాజు జ్ఞానేంద్ర. ఇప్పుడు ఆయనను తిరిగి దేశ పగ్గాలు చేపట్టమంటున్నారు. ఇటీవల ఆయన విదేశాల నుంచి రాగా.. స్వాగతించడానికి పెద్దఎత్తున ప్రజలు గుమిగూడారు. కొందరు నేపాల్ పొరుగున ఉండే ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రప‌టాలు పట్టుకుని హిందూ దేశం నినాదాలు చేశారు. ఇక నేపాల్ లో ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన 2008 నుంచి 11 సార్లు ప్రభుత్వాలు మారాయి. ఆరు నెలల కిందట ప్రచండ దిగిపోయి కేపీ శర్మ ఓలీ వచ్చారు. దీంతోనే ప్రజాస్వామ్య ప్ర‌భుత్వాల‌పై ప్రజలు విసిగిపోయారు.

మరోవైపు ప్రజాస్వామ్యం ముసుగులో నేపాల్ ప్రభుత్వాలు వామపక్ష చైనా వైపు మొగ్గుచూపుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతోనే భారత వ్యతిరేక చర్యలకు దిగుతున్నట్లు కథనాలు వచ్చాయి. ఇవన్నీ పక్కనపెడితే నేపాల్ లో హిందూ దేశం డిమాండ్ కు బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన అయిన మనీషా కొయిరాలా గట్టి మద్దతు పలికారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమ దేశం హిందూ దేశంగా ఉన్నప్పుడు చాలా బాగుందని కొనియాడారు. ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్నప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉండేదన్నారు. దేశం శాంతియుతంగా ఉందని, హిందూ దేశ హోదాను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీనివెనుక కుట్ర ఏమైనా ఉందా? అని వ్యాఖ్యానించారు.

కాగామనీషా కొయిరాలా సొంత దేశం నేపాల్ అనే సంగతి తెలిసిందే. బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. అనేక భారతీయ భాషల సినిమాల్లో నటించింది. నేపాల్ లో కొయిరాలా కుటుంబం భారత దేశంలో గాంధీ కుటుంబం తరహాలో పేరొందింది. మనీషా తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రి.