Begin typing your search above and press return to search.

మణిశంకర్ అయ్యర్ కు ఏమైంది? ఆయన అలాంటి మాటలు మాట్లాడటమా?

ఘనమైన గతం ఉన్న ప్రముఖులు వయసు పెరుగుతున్న కొద్దీ తొందరపాటు వ్యాఖ్యలు అస్సలు పనికి రాదన్న విషయాన్ని మర్చిపోతుంటారు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:33 AM GMT
మణిశంకర్ అయ్యర్ కు ఏమైంది? ఆయన అలాంటి మాటలు మాట్లాడటమా?
X

ఘనమైన గతం ఉన్న ప్రముఖులు వయసు పెరుగుతున్న కొద్దీ తొందరపాటు వ్యాఖ్యలు అస్సలు పనికి రాదన్న విషయాన్ని మర్చిపోతుంటారు. దాదాపు ఏడాది క్రితం మణిశంకర్ అయ్యర్ అనే సీనియర్ కాంగ్రెస్ నేత కం మేధావిగా ట్యాగ్ ఉన్న ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి తాజాగా వెలుగు చూసి వైరల్ గా మారింది. ఇందులో దాయాది పాక్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయన మెదడుకు ఏమైనా డ్యామేజ్ అయ్యిందా? అన్న సందేహం కలుగక మానదు. మొన్నటికి మొన్న ఇష్టారాజ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా దుమారం నుంచి బయట పడకముందే.. మణిశంకర్ అయ్యర్ మాటలు మంట పుట్టిస్తున్నాయి.

ఇంతకూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏమిటి? పాకిస్థాన్ ను విపరీతంగా పొగడాల్సిన అవసరం ఏమిటి? మనల్ని మనం తగ్గించుకోవాల్సిన పనేమిటి? అన్న సందేహాలు రాక మానదు. ఇంతకూ పాక్ ను ఉద్దేశించి మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అన్నది చూస్తే..

- పాకిస్థాన్ తో మనం చర్చలు జరపాలి

- అంతే తప్పించి సైన్యంతో రెచ్చగొట్టొద్దు

- అలా చేస్తే ఉద్రిక్తతలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది

- ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయి.

- పాకిస్థాన్ ను గౌరవించకపోతే భారత్ పై అణుబాంబులు ఉపయోగించాలన్న ఆలోచన చేస్తారు.

- మన దగ్గరా అణ్వస్త్రాలు ఉన్నాయి.

- లాహోర్ పై మనం వాటిని ప్రయోగిస్తే దాని తాలూకు రేడియేషన్ 8 సెకన్లలో అమృత్‌సర్‌ను చేరుతుంది

ఇలా ఎడాపెడా మాట్లాడిన పాత మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెర మీదకు వచ్చింది. దీనిపై తాజాగా మణిశంకర్ అయ్యర్.. కాంగ్రెస్ పార్టీలు స్పందించాయి. తాను ఎప్పుడో మాట్లాడిన వీడియోను బీజేపీ నేతలు కావాలనే ఇప్పుడు వైరల్ చేశారని ఆయన వాపోతున్నారు. అయితే.. ఆయన మిస్ అవుతున్న విషయం ఏమంటే.. తనలాంటి వాడు ఎప్పుడు.. ఏ సందర్భంలో మాట్లాడినా ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలే కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఇలాంటి చిక్కులే ఎదురవుతాయన్న విషయాన్ని మణిశంకర్ ఎందుకు మిస్ అయినట్లు?

దాయాది పాక్ ను గౌరవించొద్దని చెప్పట్లేదు. అలా అని సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం.. పాక్ విషయంలో మరీ అంత లొంగుబాబు ఎందుకన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన ఈ వీడియోతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయ్యర్ వ్యాఖ్యలు బీజేపీకి ఇప్పుడో కొత్త అస్త్రంగా మారాయి.

ఈ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపం బయటకు వచ్చిందన్నారు. ‘‘వాళ్లు పాకిస్థాన్ కు భయపడాలని చెబుతున్నారు. సరికొత్త భారత దేశం ఎవరికీ భయపడదు’’ అంటూ ఘాటుగా రియాక్టు అవుతున్నారు. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల వీడియో అసలు కథేంటి? వయసు మీద పడిన వేళ.. మణి శంకర్ అయ్యర్ లాంటి నేతలు కం మేధావుల విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం కొత్త తరహాలో ఆలోచన చేస్తే బాగుంటుందంటున్నారు. లేదంటే.. దారుణమైన ఇబ్బందులు ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ కు ఇవన్నీ వినిపిస్తాయా? అన్నది అసలు ప్రశ్న.