Begin typing your search above and press return to search.

స్మారక స్థలానికి మన్మోహన్ అర్హులు కాదా మోడీ జీ..?

దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త, ఆధునిక భారత రూపకర్త, మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Dec 2024 3:30 PM GMT
స్మారక స్థలానికి మన్మోహన్ అర్హులు కాదా మోడీ జీ..?
X

దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త, ఆధునిక భారత రూపకర్త, మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివరం అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో శనివారం ఉదయం 11:45 గంటలకు అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రుల అంత్యక్రియలకు సంబంధించిన సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రెండు పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రాస్థావించారు.

ఇందులో భాగంగా... మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని మోడీని ఖర్గే కోరారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలందించిన ఆయనకు స్మారక స్థలం ఏర్పాటుపై ఉదయం ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన ఖర్గే... రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానమంత్రులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు!

ఇదే సమయంలో... దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నరని.. ఆన సేవలు, సాధించిన విజయాల్ అపూర్వమైనవని తెలిపారు. అయితే... దీనిపై ప్రభుతం నుంచి రిప్లై రావాల్సి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... మన్మోహన్ వంటి ప్రధాని స్మారక స్థలం గురించి చెప్పించుకోవాల్సిన అవసరం ఉందా మోడీజీ? అనే ప్రాశ్నలు నెట్టింట దర్శనమిస్తున్నాయి!

కాగా.. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో అక్కడ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ సుమారు గంటపాటు ఉంచిన తర్వాత అక్కడ నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది!