మౌన యోగి...ఆర్థిక సంస్కరణల రూపశిల్పి
దేశం ఒక విషాద వార్తను గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత విన్నది. అదే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్తమయం.
By: Tupaki Desk | 26 Dec 2024 5:28 PM GMTదేశం ఒక విషాద వార్తను గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత విన్నది. అదే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్తమయం. ఆయన తొంబై రెండు ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని గడిపారు. జాతస్య మరణం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నారు. దాని అర్ధం పుట్టినవానికి మరణం తప్పదు అని. ఆ విధంగా కర్మ యోగిగా తన కర్తవ్యాన్ని ఆయన పూర్తి చేసి శాశ్వత మౌన మునిగా మారిపోయారు. ఒక జ్ఞాపకంగా దేశానికి మిగిలిపోయారు.
ఈ దేశానికి 14వ ప్రధానిగా డాక్టర్ మనొహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2004 మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలా యూపీఏ కూటమిని నాయకత్వం వహించారు. అదే విధంగా రెండు సార్లు ప్రధాని హోదాలో దేశానికి సేవ అందించి 2014 మే 26న పదవీ విరమణ చేశారు. మొత్తం 3,656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఆయన నాయకత్వం వహించారు.
ఆయన అంతకు ముందు 1991లో ఏర్పడిన పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా సేవలు అందించారు. అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనను ఆర్థిక మంత్రిగా పీవీ ఏరి కోరి ఎంపిక చేశారు. అప్పటికి దేశం బంగారం తాకట్టు పెట్టుకుని గడుపుకునే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది
పీవీ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా చేరిన మన్మోహన్ సింగ్ తనదైన మేధస్సులో సరళీ కృత ఆర్ధిక విధానాలను అమలు చేయడమే కాకుండా దేశానికి కొత్త దశ దిశను చూపించారు. అప్పటిదాకా నెహ్రూ మార్క్ ఆర్ధిక సంస్కరణలతో సాగిన దేశం ఆ తరువాత ప్రపంచానికి తలుపులు తెరచింది. దాంతో దేశంలో ఆర్ధిక రంగం పరుగులు తీసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ అందరికీ ఫలితాలు దక్కాయి.
మన్మోహన్ సింగ్ దూరదృష్టితో తీసుకున్న చర్యల వల్లనే ఇది సాధ్యమైంది. దానిని ఆ తరువాత వచ్చిన ప్రధానులు కూడా కొనసాగించారు. అలా ఆర్ధిక మంత్రిగా సక్సెస్ ఫుల్ గా తన ముద్రను వేసిన ఆయనను మెచ్చి నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశానికి ప్రధానిగా చేసింది. ఒకసారి కాదు రెండు సార్లు గాంధీ కుటుంబేతరుడు ప్రధానిగా పనిచేయడం పూర్తి కాలం కొనసాగడం అన్నది మన్మోహన్ సింగ్ సాధించిన రికార్డుగా చూడాలి.
ఆయన ప్రధానిగా ఉండగా జాతీయ ఉపాధి హామీ పధకంతో పాటు అనేక కార్యక్రమాలను తీసుకుని వచ్చారు.ఇక ఆయన అత్యున్నత విద్యావంతుడుగా ఉండి దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. అంతే కాదు దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్థరణలు రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా వ్యవహరించారు.
మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్థాన్ లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు.
గురువారం సాయంత్రం ఆయన అరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఆయన వయసు 92 సంవత్సరాలు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది అని చెప్పాలి. మౌనంగా తన పని చేసుకుంటూ దేశానికి ఎన్నో విజయాలను సాధించి పెట్టిన ఆయన ఒక కర్మయోగి అని అంతా అభివర్ణిస్తున్నారు.