మాస్ ఇమేజ్ లేని ఆ ఇద్దరే దేశ గతిని మార్చేశారు
ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని గురుశిష్యులుగా అభివర్ణించొచ్చు. లక్షలాది మందిని ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయకపోవచ్చు.
By: Tupaki Desk | 27 Dec 2024 5:47 AM GMTఅవును.. ఇద్దరంటే ఇద్దరు. దేశ గతిని మార్చటమే కాదు. ఈ రోజున భారతదేశం ప్రపంచ పటంలో కొత్త గుర్తింపునకు.. బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇద్దరంటే ఇద్దరు నేతలే కారణంగా చెప్పాలి. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరు నేతలకు ఎలాంటి మాస్ ఇమేజ్ లేకపోవటమే కాదు.. వారిద్దరిలో ఏ ఒక్కరు బహిరంగ సభ నిర్వహించినా ప్రజలు తండోపతండాలుగా రావటం ఉండదు. అంతేకాదు.. ఈ ఇద్దరు నేతల నిజాయితీని.. కమిట్ మెంట్ ను శంకించటం పాపమే అవుతుంది. కుళ్లిన వ్యవస్థలో ఎలాంటి మలినం అంటని కమలంగా విరబూసిన ఆ ఇద్దరే మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు.. మరొకరు మన్మోహన్ సింగ్.
ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని గురుశిష్యులుగా అభివర్ణించొచ్చు. లక్షలాది మందిని ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయకపోవచ్చు. ఎలాంటి జనాకర్షణ శక్తి లేని ఈ ఇద్దరు ఆర్థిక మేధావుల కారణంగా దేశ గతి మొత్తంగా మారిపోయిందని చెప్పాలి. తాజాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో మళ్లీ ఈ ఇద్దరు మాజీ ప్రధానుల గురించి దేశ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఆర్థిక రంగంలోకి సంస్కరణలు తేవటం అంత తేలికైన విషయం కాదు. కత్తి మీద సాములాంటి ఈ పనిని విజయవంతంగా నిర్వహించటమే కాదు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వేగంగా వీరు తీసుకున్న నిర్ణయాలు ఎంతో ప్రయోజనకరంగా మారాయని చెప్పొచ్చు.
పీవీ నరసింహరావు ఐదేళ్లు దేశ ప్రధానిగా సేవలు అందిస్తే.. మన్మోహన్ సింగ్ పదేళ్లు పాలించారు. ఆసక్తికరంగా ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారని చెప్పాలి. కఠిన సమయాల్లో పాలనా పగ్గాలు అందుకొని.. క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరిస్తూ వచ్చిన ఈ ఇద్దరు మాజీ ప్రధానులకు ఉన్న మరో సారూప్యత.. బలమైన నాయకత్వ లక్షణాలు లేకపోవటం. అయినప్పటికీ పార్టీ హైకమాండ్ కు అనుగుణంగా పని చేస్తూ.. ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే. తాము చేయాలనుకున్న ఆర్థిక సంస్కరణల్ని చేసుకుంటూ పోయారు.
కోట్లాది మంది మనసుల్ని దోచుకొని ప్రధానమంత్రులుగా పదవీ బాధ్యతల్ని చేపట్టిన వారితో పోలిస్తే.. ఎలాంటి మాస్ ఇమేజ్ లేకుండా ప్రధాని కుర్చీలో కూర్చోవటం.. ఆ పదవికి కొత్త ఇమేజ్ ను తీసుకురావటంలో ఈ ఇద్దరు ఇద్దరనే చెప్పాలి. వీరి పాలనలోనే ఆర్థికంగా దేశ ముఖచిత్రం మారటమే కాదు.. ఎన్నో పాలనా సంస్కరణలు.. సంక్షేమ పథకాలు తెర మీదకు తీసుకురావటమే కాదు.. విజయవంతంగా అమలు చేశారని చెప్పాలి. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఈ ఇద్దరు నేతలు భారత దేశ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోవటం ఖాయమని చెప్పక తప్పదు. వారికి.. భారతావని ఎంతగానో రుణపడి ఉంది. రేపటి విజయాలకు బాటలు వేసేలా వారి నిర్ణయాలు భారతీయులకు ఎప్పటికి గుర్తిండిపోతాయని చెప్పక తప్పదు.