లక్షలాది పేదలను గట్టెక్కించిన రి'ఫార్మర్'..మన్మోహన్ ను అన్నది ఎవరో
మన ఇంట్లో ఇప్పుడు వాడుతున్న వస్తువుల్లో చాలా వరకు మన్మోహన్ చలవే..? అదేంటి.. ఆయన అలా ఎలా చెబుతారు? అంటారా?
By: Tupaki Desk | 27 Dec 2024 12:10 PM GMTమన ఇంట్లో ఇప్పుడు వాడుతున్న వస్తువుల్లో చాలా వరకు మన్మోహన్ చలవే..? అదేంటి.. ఆయన అలా ఎలా చెబుతారు? అంటారా? 1991కి ముందు ఉన్న భారత దేశం వేరు.. ఇప్పుడు మనం చూస్తున్నది వేరు.
అప్పట్లో లైసెన్స్ రాజ్.. రెడ్ టేపిజం.. విదేశాలకు ఎగుమతులపై ఆంక్షలు.. అడుంగటిన విదేశీ మారక నిల్వలు.. భారత్ అంటే ప్రపంచ పటంలో ఎక్కడుందీ అని వెదికే కాలం అది.
ఇలాంటి సమయంలో తెలుగువారి ఖ్యాతి పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) సారథ్యంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. దీంతో విదేశీ మార్కెట్ కు భారత్ తలుపులు బార్లా తెరిచినట్లయింది. ఇది కొన్ని వర్గాలవారిని కోటీశ్వరులను చేసిందనడంలో సందేహం లేదు. ఎంతోమందిని పేదరికం నుంచి బయటపడేసింది.
ఆయన హయాం సువర్ణాధ్యాయం
మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసిన కాలం భారత దేశ చరిత్రలోనే అద్భుత కాలంగా చెప్పొచ్చు. ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చట్టాలు అప్పుడే వచ్చాయి. ఇక మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే అగ్ర రాజ్యం అమెరికాతో అణు సహకార ఒప్పందం కుదిరింది. దీంతో మన్మోహన్ మరణంపై అమెరికా స్పందించింది. రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతికి ఆయన పునాది వేశారని కొనియాడింది. అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ నాయకత్వం కీలకం అని కొనియాడింది.
భారత ప్రగతికి రాచబాట
భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని.. ఆయన ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతారని అమెరికా కొనియాడింది. కాగా, మన్మోహన్ అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు ప్రత్యేక అభిమానం. ఒబామా తొలిసారి అధ్యక్షుడు కావడానికి కొద్దిగా ముందు 2008లో అణు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వామపక్షాలు మద్దతు వెనక్కు తీసుకోవడంతో మన్మోహన్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి కూడా వచ్చింది. ఎలాగోలా ఆ పరిస్థితి తప్పింది. ఇక అణు ఒప్పందం తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన జీ20 సదస్సులో మన్మోహన్ పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను ఆయన నిజం చేశారని కొనియాడారు.
‘‘ఆయన అసాధారణ ప్రతిభావంతుడు. నిజాయతీపరుడు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం నిబద్ధతతో పనిచేశారు. తన సంస్కరణలతో ఎంతోమందిని పేదరికం నుంచి బయట పడేశారు. ఆలోచనాత్మక, కపటం లేని వ్యక్తిత్వం మన్మోహన్ సొంతం’’ అంటూ ఒబామా రాసిన ‘ఎ ప్రామిస్ట్ ల్యాండ్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు.