90 ఏళ్ల వయసు.. తీవ్ర అనారోగ్యం.. అయినా వీల్‌చైర్‌లో వచ్చి. మాజీ ప్రధాని నిబద్ధతకు హ్యాట్సాఫ్
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై జరిగిన చర్చకు అందరూ పాల్గొనాల్సిందే
By: Tupaki Desk | 8 Aug 2023 6:52 AM GMT"ఆయనకు నిబద్ధత లేదు. వ్యక్తిగా ఆయన మంచిగా ఉంటే సరిపోతుందా? ఆయన చుట్టూ ఉన్న వారిని కూడా మంచిగా ఉంచాలికదా. ఎవరో ఏదో చెబితే.. దాని ప్రకారమే ఆయన చేస్తున్నారు. ఆయనలో నిబద్ధత లేదు. తెగువలేదు"- ఇదీ. 2014కు ముందు ఈ దేశాన్ని 10 సంవత్సరాలపాటు ప్రధానిగా ఉండి ముందుకు నడిపించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి అప్పట్లో వినిపించిన వ్యాఖ్యలు, విమర్శలు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఆయనకు 90 ఏళ్లు. పైగా.. తీవ్ర అనారోగ్యం. వీల్ చైరే ఇప్పుడు ఆయనకు పట్టుపాన్పు. అంటే.. ఒకరకంగా.. ఇల్లు విడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ, ఆయన `నిబద్ధత`ను చాటుకున్నారు. రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై జరిగిన చర్చకు అందరూ పాల్గొనాల్సిందే.. అంటూ మూడంచెల విప్‌ను జారీ చేసిన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధులై.. అతికష్టమే అయినా.. అత్యంత మనసు పెట్టి సభకు వచ్చారు. తన నిబద్ధతను చాటుకున్నారు.
ఢిల్లీ సర్వీసులపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని .. మాట్లాడకపోయినా.. ఆసాంతం అన్నీ వీక్షించారు. చర్చను ఓపికగా ఉన్నారు. వీల్ చైర్‌లోనే ఓ పక్కగా కూర్చుని.. ఓటింగ్ జరిగే వరకు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్దేశాను సారం.. ఆయన ఢిల్లీ బిల్లుకు వ్యతిరకంగా ఓటేశారు. నిజానికి మూడంచెల విప్‌ను జారీ చేయకపోయి ఉంటే.. అనేక మంది యువ ఎంపీలు కూడా డుమ్మా కొట్టేవారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వీల్ చైర్‌కే పరిమితమైన మన్మోహన్ వంటివారు.. ఇటు పార్టీకి, అటు.. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చిదిమేస్తున్న వైనానికి అడ్డు కట్టవేసేందుకు నడుం బిగించడం.. సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.