సంచలన రీతిలో ఎమ్మెల్సీగా గెలిచి.. సీఎం అయ్యాక చేజారిన అదే స్థానం
అయితే, 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం రేవంత్ రాజకీయ జీవితానికి పెద్ద మలుపు.
By: Tupaki Desk | 3 Jun 2024 1:42 PM GMTరాజకీయం మొదలైన చోటనే ఓటమి అంటే ఇదేనేమో..? సరిగ్గా 17 ఏళ్ల కిందట 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టిన నాయకుడు.. అత్యంత ప్రభావవంతమైన సీఎంగా అయ్యాక అదే స్థానంలో ఓటమిని ఎదుర్కొన్నారు.
దీనిని విధి విచిత్రం అనాలేమో..? నాడు ఏమాత్రం బలంలేని చోట సంచలన రీతిలో గెలిచిన ఆయన నేడు శక్తిమంతమైన పదవిలో ఉంటూ పరోక్షంగా ఓటమిని భరించాల్సి వచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగిన ఆయన 18 ఏళ్లలో జడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం అయ్యారు. అయితే, 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం రేవంత్ రాజకీయ జీవితానికి పెద్ద మలుపు.
అప్పట్లో అంటే 2007లో ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారు. కానీ, రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా దిగి అన్ని పార్టీల వారి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. తద్వారా చట్ట సభలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సంచలన విజయంతో.. ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి 2009లో కొడంగల్ టికెట ఇచ్చారు. నాటి ఎన్నికల్లో రేవంత్ గెలవడం తదుపరి సంగతి.
నాడు గెలిచి.. నేడు ఓడి..
2007లో పాలమూరులో స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ కు తాజాగా వెలువడిన ఫలితాలు చేదు అనుభవం మిగిల్చాయి. ఆదివారం ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్లతో గెలిచారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది.
ఏది ఏమైనా.. తాను స్వతంత్రుడిగా గెలిచిన చోట.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడడం చర్చనీయాంశమే.