"కూర్చుని మాట్లాడుకుందాం.. నీ కరెంట్ తీగ"... మనోజ్ పోస్ట్ ఎవరికి?
గత ఏడాది చివర్లో మంచు ఫ్యామిలీలో మంటలు వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jan 2025 7:32 AM GMTగత ఏడాది చివర్లో మంచు ఫ్యామిలీలో మంటలు వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకోగా.. జర్నలిస్టుపై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు! ఆ స్థాయికి వెళ్లిన వ్యవహారం.. తర్వాత పోలీసులు, కోర్టు ప్రమేయంతో కాస్త కామ్ అయినట్లు కనిపించింది.
ఈ సమయంలో తాజాగా ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగ వేళ కనుమ రోజున మరోసారి మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం తెరపైకి వచ్చింది. మరోసారి అటు మీడియాలోనూ, ఇటు నెట్టింట వైరల్ గా మారింది. చంద్రగిరిలోని పోలీస్ స్టేషన్ లో మళ్లీ ఫిర్యాదులు చేయడం, కేసులు నమోదవ్వడం మొదలైంది! ఈ సమయంలో మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
అవును... గత కొన్ని రోజులుగా కుటుంబంలోని ఘర్షణల మధ్య నలిపోతున్నట్లు కనిపిస్తున్న మంచు మనోజ్... మోహన్ బాబు నటించిన సినిమాలోని కొన్ని సీన్లు సెలక్టివ్ గా ఎక్స్ లో వదులుతున్నారు. ఈ సమయంలో.. తాజాగా "కలిసి కూర్చొని మాట్లాడుకుందాం.. నీ #కరెంట్ తీగ" అని #విస్ మిథ్ కోట్ తో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో... ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... "కూర్చొని కలిసి మాట్లాడుకుందామ్.. ఇంట్లోని మహిళలు, నాన్న, స్టాఫ్, మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే మట్లాడుకుందామ్.. ఏం అంటావు..? నేను ఒంటరిగానే వస్తాను అని మాట ఇస్తున్నా.. నీకు నచ్చిన వాళ్లను నువ్వు తెచ్చుకోవచ్చు.. లేదా, మనమే ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం.. నీ #కరెంట్ తీగ" అని మంచు మనోజ్ రాసుకొచ్చారు.
ఇదే సమయంలో... 'అత్తారింటికి దారేది' సినిమాలో నటి హేమను బ్రహ్మానందం బుగ్గ గిల్లే సన్ని వేశానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అనేది స్పష్టంగా చెప్పనప్పటికీ... హ్యాష్ ట్యాగ్ 'విస్ మిథ్' అని పోస్ట్ పెట్టడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తూ.. వారిని ఉద్దేశించే ఈ పోస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా... ఇటీవల కనుమ పండుగ రోజున తిరుపతిలోని ఎంబీ యూనివర్శిటీ వద్దకు తన నానమ్మ, తాతయ్యలకు నివాళులు అర్పించేందుకు మనోజ్, మౌనిక చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అక్కడ ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై మనోజ్ చంద్రగిరి పోలీసులు ఆశ్రయించగా.. దీనిపై మోహన్ బాబు పీఏ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విధంగా కొంతకాలంగా మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం రచ్చ కెక్కి, కొనసాగుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ ఇలా పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.