Begin typing your search above and press return to search.

చంద్రబాబు, రేవంత్ లకు మనోజ్ విజ్ఞప్తి... మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు!

ఈ సమయంలో.. తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:37 AM GMT
చంద్రబాబు, రేవంత్  లకు మనోజ్  విజ్ఞప్తి... మోహన్  బాబుపై సంచలన ఆరోపణలు!
X

మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ సమయంలో.. తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇందులో భాగంగా.. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. తన కుమారుడు మనోజ్ తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో... కుటుంబ వ్యవహారాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. పారదర్శకంగా విచారణ చేపట్టి, తనకు న్యాయం చేయాలని కోరారు.

అవును... తనపై తన తండ్రి చేసిన ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ, పలు కుటుంబ అంశాలను ప్రస్థావిస్తూ మంచు మనోజ్ మూడు పేజీల లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణ డీజీపీని తన పోస్టుకు మనోజ్ ట్యాగ్ చేశారు.

ఈ సందర్భంగా... తనపైనా, తన భార్యపైనా చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం అని.. ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా, సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నామని.. ఆర్థిక సాయం కోసం తానెప్పుడూ కుటుంబంపై ఆధారపడలేదని.. ఎలాంటి ఆస్థిపాస్తులూ అడగలేదని మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు.

తన అన్న (మంచు విష్ణు) కొన్ని కారణాల రీత్యా దుబాయికి వెళ్లడంతో.. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని.. మా నాన్న, అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లానని.. ఏడాదిగా ఆ ఇంట్లోనే ఉంటున్నానని.. ఆ సమయంలో తన భార్య గర్భవతిగా ఉందని తెలిపారు.

అయితే.. తప్పుడు ఉద్దేశ్యంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని.. కావాలనే నాపైనా, నా భార్యపైనా ఆరోపణలు చేశారని.. గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటోంది మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు మనోజ్.

ఈ వివాదంలోకి ఏడు నెలల తన కూతురుని కూడా లాగారని.. ఇది ఎంతో అమానవీయం అని.. ఇలాంటి విషయాల్లోకి పిల్లలను లాగవద్దని.. వారిని గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలుస్తోందని.. తన భార్యకు తప్పుడు ఉద్దేశ్యాలు ఆపాదించడం సరైంది కాదని అన్నారు.

ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని మా నాన్న దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారని.. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారని.. ఈ ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు తనవద్ద ఉన్నాయని మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యదులోనూ నిజం లేదని.. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని.. నా గాయానికి సంబంధించిన వైద్యపరీక్షల కోసం నేను, నా భార్య ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లామని క్లారిటీ ఇచ్చారు!

ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు ఏమయ్యాయని ప్రశ్నించిన మనోజ్... విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి వాటిని ఎందుకు తొలగించారని అడిగారు. ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకిత్తిస్తోందని.. వారు ఈ ఫుటేజీలను ఎందుకు దాచిపెడుతున్నరనేది విచారణ చేపట్టి నిజాన్ని కనుగొనాలని మనోజ్ కోరారు!

ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ తాను కెరీర్ నిర్మించుకున్నానని.. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, అన్న సినిమాలకు పనిచేశానని.. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించానని.. పలు చిత్రాల్లో హీరోగా చేశానని.. వీటన్నింటికీ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా చేశానని మనోజ్ వెల్లడించారు.

తన అన్న విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని.. నేనెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని.. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్లు నిరూపించాలని సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. తన వక్తిగత ప్రతిభ ఆధారంగా జీవితాన్ని నిర్మించుకున్నానని.. కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో తన తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదని.. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి.. మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబీయూ) విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారని.. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించారు మనోజ్.

ఇదే సమయంలో యూనివర్శిటీలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తానని.. తన తండ్రి తనను పక్కకు తప్పించి, విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడని.. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగిందని.. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు!

కుటుంబ వివాదాల పరిష్కారం కోసం నిజాయతీగా, అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్ లో మా నాన్నను హృదయపూర్వకంగా వేడుకున్నానని చెప్పిన మనోజ్... కుటుంబం పేరును నిలబెట్టడం నా బాధ్యత అని ఆన్నారు. అయితే.. తనను తండ్రి పట్టించుకోలేదని.. ఇప్పుడు తప్పుడు ఆరోపణలు కూడ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకూ, తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు అని చెప్పిన మనోజ్... పరిస్థితులు ఎంతటి సవాళ్లను విసిరినా.. వాటిని ఎదుర్కోవడానికి సరైన దానికోసం పోరాడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని హామీ ఇస్తున్నానని మనోజ్ తెలిపారు!