Begin typing your search above and press return to search.

అప్పట్లో ఒకడుండేవాడు.. ఎలాన్ మస్క్ ను మించిన అపర కుబేరుడు

అయితే, ఇది సగం మాత్రమే వాస్తవం... సంపదలో మస్క్ ను మించినవాడు అప్పట్లో ఒకడుండేవాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 1:30 PM GMT
అప్పట్లో ఒకడుండేవాడు.. ఎలాన్ మస్క్ ను మించిన అపర కుబేరుడు
X

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? కొన్ని సంవత్సరాలుగా తడుముకోకుండా అందరూ చెప్పే సమాధానం ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్.. ఇంకా చెప్పుకొంటూ పోతే ఎన్నో సంస్థలకు అధిపతి ఆయన. మస్క్ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందీ అంటే.. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.20 లక్షల కోట్లకు పైమాటే.. లేదా 20 లక్షల కోట్లు అనుకోవచ్చు. భారత అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ సంపద మస్క్ ఆస్తి లో సగమే.. ఇక మొన్ననే అత్యంత వైభవంగా కుమారుడి పెళ్లి చేసిన ముఖేశ్ అంబానీ సంపద.. మస్క్ సంపదలొ 40 శాతం కూడా ఉండదు.. బిలియన్లలో చెప్పాలంటే మస్క్ సంపద 221 బిలియన్ డాలర్లు. 200 బిలియన్ డాలర్లు దాటిన తొలి వ్యక్తి కూడా మస్క్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, ఇది సగం మాత్రమే వాస్తవం... సంపదలో మస్క్ ను మించినవాడు అప్పట్లో ఒకడుండేవాడు.

7 శతాబ్దాల కిందటనే మస్క్ కు డబుల్

మస్క్ సంపద 220 బిలియన్ డార్లకు పైనే అని చెప్పుకొన్నాం కదా.. కానీ, ఏడు వందల ఏళ్ల కిందట (క్రీస్తు శకం 1300)నే మస్క్ ఇప్పటి సంపద కంటే రెట్టింపు ఆస్తి ఒకడికి ఉండేది. అంటే.. 400 బిలియన్ డాలర్లు. మరీ చెప్పాలంటే.. మస్క్ ప్రస్తుత సంపద కంటే రెండు రెట్లు. అసలు మానవ జాతి చరిత్రలోనే అతడి అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటివరకు లేడంటే అతిశయోక్తి కాదేమో? ఆయన పేరే మన్సా మూసా.. అతడు ఒక మహా చక్రవర్తి.

సగం ఆఫ్రికా ఖండం ఆయనదేనట..

క్రీస్తు శకం 1312 నుంచి 1337 వరకు సగం ఆఫ్రికా ఖండం మాన్సా మూసాదేనట. ఇంకా చెప్పాలంటే.. మాలి, సెనెగల్‌, గాంబియా, గినియా, నైగర్‌, నైజీరియా, చాద్‌, మారిటేనియా ఇంకా పలు దేశాలతో కూడిన విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు మూసా. ఈ మహా సామ్రాజ్యాన్ని ‘మాలి’గానే పిలిచేవారట. అంతేకాదు.. నైగర్ నది ఒడ్డున ఉన్న పురాతన నగరం టింబుక్టును కట్టింది మూసానే. పశ్చిమాసియా, ఆఫ్రికా నలుమూలల నుంచి వేల మందితో ఈ పని చేయించారట. కాగా, మూసా సామ్రాజ్యంలో అంతా బంగారు, ఉప్పు గనులే. బంగారు గనులు ఎక్కువగా ఉండడంతో వేల టన్నుల బంగారం ఈయన ఖజానాలో ఉండేది. ఎగుమతి చేయడం ద్వారా భారీగా సంపద దేశానికి తరలివచ్చింది.

ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్తూ మూసా.. ఈజిప్టులో ఆగి అక్కడి రాజుకు ఇచ్చిన బంగారం గురించి తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది. మూసా బహుమతితోనే ఈజిప్టులో బంగారం విలువ పడిపోయిందంటే ఎంత బంగారం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ యాత్రకు మూసా దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరాడట. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన యాత్ర. మాసా హయాంలో మాలిలోని పలు ప్రాంతాలు విద్యాకేంద్రాలుగా ఉండేవి. సుదూర తీరాల నుంచి వేలమంది విద్యార్థులు వచ్చేవారట. ఇవేకాక మూసా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారని.. విద్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కృషిచేశారని చెబుతాంటారు.

25 ఏళ్ల పాటు పాలించి..

మాలి మహా సామ్రాజ్యన్ని 25 ఏళ్లపాటు పాలించిన మూసా.. 1337లో చనిపోయాడు. అతడి తర్వాత వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మహా సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది.