రిపోర్టు: అన్ని జీవ జాతుల్ని అంతరించేలా చేస్తున్న మనిషి స్వార్థం
అలాంటప్పుడు తనతోటి జీవ జాతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనిషికి లేదా? అంటే.. కచ్ఛితంగా ఉంది.
By: Tupaki Desk | 25 Feb 2024 4:22 AM GMTనేను మాత్రమే బతికితే చాలన్నట్లుగా ఎవరైనా వ్యవహరిస్తే.. మరీ ఇంత స్వార్థమేమిట్రా బాబు అనేస్తాం. మరి.. ఈ భూమి మీద కోట్లాది జీవ జాతులతో పాటు మనిషి ఉన్నాడు. ఈ భూమండలం మనిషి ఒక్కడి సొత్తు ఎంతమాత్రం కాదు. అలాంటప్పుడు తనతోటి జీవ జాతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనిషికి లేదా? అంటే.. కచ్ఛితంగా ఉంది. కానీ.. అలా చేయకుండా.. తన క్షేమమే తప్పించి.. మిగిలిన జీవ జాతుల గురించి పట్టని తీరు కళ్లకు కట్టేలా చూపే తాజా రిపోర్టు వెలుగు చూసింది. ఇందులో విస్తుపోయేఅంశాలున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారి సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్య సమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐక్యరాజ్యసమితి ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1189 జీవ జాతుల్ని లోతుగా పరిశీలించారు. ఇందుకు సాయంగా 50 ఏళ్ల నుంచి ఇదే అంశంపై అధ్యయనం చేసే ఐయూసీఎన్.. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల్ని తీసుకున్నారు
ఈ సందర్భంగా షాక్ తినే అంశాలు వెలుగు చూశాయి. అతి త్వరలో 22 శాతం జీవ జాతులు పూర్తిగా అంతరించనున్నట్లుగా తేల్చారు. మొత్తంగా 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతున్న వైనం వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలోపడ్డాయని.. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కాదని పేర్కొన్నారు. అయితే.. ఇన్నేళ్లలో లేని ముప్పు తాజాగా వచ్చి పడిందని పేర్కొన్నారు. దీనికి కారణం మనిషి జోక్యమని తేల్చారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న మనిషి తీరుతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరవాలని చెబుతున్నారు.
కొన్ని పక్షి జాతులు ప్రతి ఏడాది 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి. పర్యావరణ సంతులన పరిరక్షణకు ఇవెంతో దోహదం చేస్తాయి. కానీ.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం పక్షల మీద విపరీతంగా పడుతోంది. వీటికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఐదో వంతు వలస జీవులు అతి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. 22 శాతం జీవులు అతి త్వరలోనే అంతరించేలా ఉన్నాయి. మొత్తంగా ఐదో వంతు జాతులు అంతరించే ముప్పును ఎదుర్కొంటున్నాయి. జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. రానున్న కాలంలో ఆహార భద్రతపైనా ప్రభావం చూపుతుంది. జంతువులు.. చేపలు వంటి వాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కార్చిచ్చులు.. గ్లోబల్ వార్మింగ్ లు ఇందుకు తోడుగా నిలుస్తున్నాయి. పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాల్సిందే.