తెలివి చల్లగుండా... దేహానికి జింక్ అవసరమని ఇలా చేస్తాడా?
శరీరానికి జింక్, కాల్షియం, ఐరన్ అవసరం! తినే ఆహారంలో పప్పులు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి!
By: Tupaki Desk | 28 Feb 2024 6:17 AM GMTశరీరానికి జింక్, కాల్షియం, ఐరన్ అవసరం! తినే ఆహారంలో పప్పులు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి! పాలు, గుడ్లు రెగ్యులర్ గా తీసుకోవాలి! ఇలాంటి ఆరోగ్య సూత్రలు నిత్యం వింటూనే ఉంటా.! ఇప్పుడు.. శరీరానికి మాంసకృతులు కావాలంటే... మేకల మందపై పడతారా.?, గుడ్లు తినమన్నారని కోళ్ల ఫారంలపై దాడి చేస్తారా.? ఐరన్ అవసరం అని ఇనుప వస్తువులపై ప్రతాపం చూపిస్తారా.? మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరూ అలా చేయరనేది పై ప్రశ్నలకు సమాధానంగా వస్తుంది!
కానీ... శరీరానికి జింక్ అవసరమని ఎక్కడో చదివిన పాపానికి... రూపాయి నాణాలను మింగేశాడు ఓ ప్రబుద్దుడు! పైగా... అవి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో.. తన శరీరంలో జింక్ లోపిస్తుందో.. దానివల్ల ఆసుపత్రికి వెళ్లాలేమో అని భావించాడో ఏమో కానీ... అలా మింగిన నాణాలు బయటకు రాకుండా వాటిని కడుపులోనే పట్టి ఉంచేలా అయస్కాంతం ముక్కలు కూడా మింగాడు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడి తెలివి తేటలకు వైద్యులు షాక్ తిన్నారు!
అవును... దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 26ఏళ్ల యువకుడు ఒకరు నాణాలు, అయస్కాంతం ముక్కలను మింగేశాడు. దీంతో... తాజాగా అతడికి తీవ్రమైన కడుపునొప్పి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో కడుపునొప్పితో బాదపడుతున్న అతడిని కుటుంబ సభ్యులు "సర్ గంగారాం" ఆసుపత్రికి తరలించారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ అవసరం అని తెలిపారు. ఈ సమయంలో వైద్యులు అవాక్కయారు.
కారణం... అతడి కడుపులో రెండు, ఐదు రూపాయల నాణాలు సుమారు 39 ఉండగా... వివిద సైజుల్లో ఉన్న అయస్కాంతం ముక్కలు 37 ఉన్నాయి. దీంతో ఈ విషయాలపై స్పందించిన ల్యాప్రోస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్యబృందం... వాటిని అన్నింటినీ ఆపరేషన్ చేసి తొలగించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పని ఎందుకు చేసినట్లు అని అడిగిన వైద్యులకు.. ఆ యువకుడు చెప్పిన సమాధానం షాక్ ఇచ్చిందని తెలుస్తుంది.
ఈ సమయంలో స్పందించిన యువకుడు... శరీరానికి జింక్ అవసరం అని ఎక్కడో చదివినట్లు చెప్పాడట. అయితే నాణాల్లో జింక్ ఉండటం వల్ల అది దేహాన్ని ధృడంగా ఉంచుతుందని వాటిని మింగినట్లు చెప్పాడు. మరి అయస్కాంతంలో ఏముంటుందని మింగావు? అనే ప్రశ్నకు సమాధానంగా... ఆ నాణాలు శరీరంలో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అయస్కాంతం ముక్కలు మింగినట్లు తెలిపాడట!
ఈ సమాధానాలతో వైద్యులు అవాక్కవ్వగా... ఇతడి మానసిక పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.