Begin typing your search above and press return to search.

మనుబాకర్ విజయం వెనుక 'థాంగ్ తా' యుద్ధకళ

తన ఆట తీరుతో చరిత్రను క్రియేట్ చేసిన మనుబాకర్ విజయంలో మణిపూర్ కు చెందిన యుద్ధకళ 'థాంగ్ తా' ఉందన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 5:15 AM GMT
మనుబాకర్ విజయం వెనుక థాంగ్ తా యుద్ధకళ
X

పారిస్ ఒలింపిక్స్ కు ముందు మనుబాకర్ అన్న పేరు చెబితే చాలా తక్కువ మందికి మాత్రమే ఆమె పేరు తెలుసు. కానీ.. ఈ రోజున ఆమె పేరును గుర్తించని భారతీయుడే ఉండడు. ఒలింపిక్స్ లో ఒక్క పతకం సాధించటమే గొప్పన్న పరిస్థితుల్లో ఏకంగా రెండు పతకాల్ని సాధించిన ఆమె ప్రతిభ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించేంతలా ఆమె ఎలా సిద్ధమయ్యారు? అందుకు ఏమేం చేశారు? లాంటి ప్రశ్నలకు తాజాగా సమాధానాలు లభిస్తున్నాయి. గురి తప్పకుండా లక్ష్యాన్ని చేధించటం కోసం.. ఎంత కఠినంగా శ్రమించారన్న విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

తన ఆట తీరుతో చరిత్రను క్రియేట్ చేసిన మనుబాకర్ విజయంలో మణిపూర్ కు చెందిన యుద్ధకళ 'థాంగ్ తా' ఉందన్న విషయం తాజాగా వెలుగు చూసింది. కేరళ కలరిపట్టు మాదిరి మణిపూర్ లో 'థాంగ్ తా' అనే యుద్ధకళ ఉంది. మనుసును లగ్నం చేయటం.. దేహాన్ని సిద్ధం చేయటంలో ఈ యుద్ధకళ కీలక భూమిక పోషించింది. ఒలింపిక్స్ విజయం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు ఆమె నోటి నుంచి వచ్చిన సమాధానం వింటే ఇట్టే అర్థమవుతుంది ఆమె ఎంత సీరియస్ గా శ్రమించారో. ''నేను మహిళను కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. షూటర్ గా గట్టిగా నిలవటానికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా. అందులో 'థాంగ్ తా' నేర్చుకోవటం ఒకటి. షూటర్ గా గెలుపు అంత తేలికైంది కాదు. బయట ఎంత బాగా రాణించినా.. పోటీ వేళ ఉండే ఒత్తిడిని అధిగమించి తొణక్కుండా పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యమవుతుంది'' అని పేర్కొంది.

తన శరీరాన్ని.. మనసును రాటుదేలి ఉండేందుకు సంవత్సరాల తరబడి శారీరక.. మానసిక శ్రమను చేసింది. యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే.. గుర్రపుస్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. ఎందుకలా అంటే.. గురి తప్పకుండా పిస్టల్ పేల్చటం అంటే.. గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరుకులెత్తించటమే. ప్రాణమున్న గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని పిస్టల్ ను అదుపులోకి తెచ్చుకోవటం ఎంతో సులువు. అందుకే గుర్రపుస్వారీ నేర్చుకుంది. అక్కడితో ఆగకుండా మణిపూర్ యుద్ధకళ 'థాంగ్ తా'ను కఠినంగా అభ్యసించింది. ఈ యుద్ధకళను అభ్యసించే వారికి మొదట నేర్పేది.. తన ఆహాన్ని వీడి గురువుకు లోబడి ఉండటమే. కత్తి.. బల్లెం.. డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం. విపరీతమైన క్రమశిక్షణ.. నిజాయితీ.. గౌరవం ఈ కళలో ముఖ్యమని చెబుతారు.

గతంలో మణిపూర్ లోని ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకునేవాడు. మహిళలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. భవిష్యత్తులో దీన్నిఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందన్న ఆశను వ్యక్తం చేస్తుంటారు. ఈ యుద్ధకళ చెప్పేదొక్కటే.. ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారని. అందుకే ఈ యుద్ధకళను అభ్యసించటం ద్వారామనుబాకర్ తనను తాను మార్చుకుంది. ఆమె అద్భుత విజయం వెనుక.. ఆమెను ఆ దిశగా నడిపించిన కోచ్ జస్పాల్ రాణ కీలకభూమిక పోషించారు. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు అధిక్యతను అంగీకరించాల్సి ఉంటుంది. చాలామంది శిష్యులు చేసే ఈ తప్పును అతి చిన్న వయసులోనే మనుబాకర్ అధిగమించింది. అదే.. ఆమెను ఈ రోజున అత్యున్నత స్థానంలో నిలిపింది. అందుకు.. మణిపూర్ యుద్ధకళ థాంగ్ తూ సాయం చేసింది.