ట్రెండింగులో 'లొట్ట పీసు'.. ఇంతకీ దాని అర్థం తెలుసా..!
తాజాగా భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ పదాన్ని వినియోగించారు.
By: Tupaki Desk | 9 Jan 2025 11:05 AM GMT'లొట్ట పీసు యవ్వారాలు మాకొద్దండి' ఇటువంటి మాటలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వింటుంటాం. పనికిరాని మాటలు, పనులు, ఉపయోగం లేని యవ్వారాలను ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్యలు చాలామంది చేస్తుంటారు. తాజాగా భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ పదాన్ని వినియోగించారు.
తనపై ఈ రేస్ కార్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టడాన్ని ఉద్దేశించి ఈ పదాన్ని వినియోగించారు. అదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసలు లొట్టపీసు పదానికి అర్థం ఏంటి అన్నదానిపై తెలంగాణలో చర్చ మొదలైంది. అదే సమయంలో ఇంటర్నెట్లో కూడా ఈ పదం గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. అసలు లొట్ట పీసు అన్న పదాన్ని ఎందుకోసం వాడుతారు అన్నదానని చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. ఎక్కువమంది దీని గురించి సెర్చ్ చేస్తుండడంతో ఈ పదం ప్రస్తుతం ట్రెండింగ్లోకి వచ్చింది.
లొట్ట పీసు అంటే ఏమిటి అనే అర్థాన్ని చాలామంది వెతుకుతున్నారు. లొట్ట పీసు అనేది ఒక మొక్క పేరు. ఇది కాలువలు, కుంటలు, చెరువుల్లో పెరుగుతుంది. దీని కాండం తెల్లని పూతతో లొట్ట (లోపల ఖాళీ, డొల్ల)గా ఉంటుంది. అందుకే దీనిని లొట్ట పీసు అని అంటుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్క గురించి తెలిసిన వారికి దీని గురించి శ్రద్ధగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పసలేని మాటలు, వ్యవహారాల గురించి చర్చకు వచ్చినప్పుడు లొట్ట పీసు అనే సందర్భానుసారంగా పదాన్ని వాడుతుంటారు.
తెలంగాణలో కూడా ఈ పదం చాలా మందికి తెలుసు. కానీ కేటీఆర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ తొలిసారి ఈ పదాన్ని వినియోగించడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రజలు కేటీఆర్ ఈ మాట అన్న తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. భలే మాట అన్నాడంటూ ఎంతోమంది వ్యాఖ్యానించారు. అయితే దీని అర్థం తెలియని ఎంతో మంది మాత్రం ఏమిటా అంటూ ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించారు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా ఈ పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.