ఈసారి ఏపీ అసెంబ్లీలో ఇన్ని పార్టీలా ?
దాని కంటే ముందు ఉమ్మడి ఏపీలో వామపక్షాలు కాంగ్రెస్, టీడీపీ టీఆర్ ఎస్, ప్రజారాజ్యం ఇలా చాలా కనిపించాయి.
By: Tupaki Desk | 3 Jun 2024 4:01 AM GMTఏపీ అసెంబ్లీ విభజన తరువాత 2014లో చూస్తే కేవలం మూడే పార్టీలు కనిపించాయి. అధికార టీడీపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఉంటే మిత్రపక్షంగా బీజేపీ సభలో ఉండేది. అంటే మూడే పార్టీలు అన్న మాట. దాని కంటే ముందు ఉమ్మడి ఏపీలో వామపక్షాలు కాంగ్రెస్, టీడీపీ టీఆర్ ఎస్, ప్రజారాజ్యం ఇలా చాలా కనిపించాయి.
ఇక 2019 నాటికి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చింది విపక్ష పాత్రలోకి టీడీపీ వచ్చింది. ఇక జనసేన ఒక సీటుతో అసెంబ్లీలోకి ప్రవేశించింది. ఆ విధంగా చూస్తే మరో సారి అదే తీరున మూడు పార్టీలు కనిపించాయి. మరి 2024 అసెంబ్లీలోకి ఎన్ని పార్టీలు వస్తాయి అన్నదే చర్చగా ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే రకరకాలుగా ఇస్తూ వచ్చాయి. చాలా సర్వేలు మాత్రం ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఈసారి గ్యారంటీగా కనిపించవచ్చు అని చెబుతున్నాయి. అవేంటి అంటే వైసీపీ, టీడీపీ జనసేన బీజేపీ. ఈ నాలుగు పార్టీలు కన్ ఫర్మ్ గా అసెంబ్లీలో ఈసారి చూడొచ్చు అని అంటున్నారు.
కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ కూడా ఒకటి రెండు సీట్లు గెలుస్తుంది అని చెప్పాయి. చీరాల నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ గట్టి పోటీ ఇచ్చారు. ఆయన గెలిస్తే కాంగ్రెస్ కి చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి వస్తే కనుక అసెంబ్లీలో అయిదు పార్టీలు కనిపిస్తాయి. వామపక్షాలు ఈసారి పోటీ చేసినా ప్రభావం ఎంత చూపాయో తెలియదు. మరి 2009 తరువాత ఏపీ అసెంబ్లీలో వామపక్షాలు కనిపించలేదు.
ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వారికి అసెంబ్లీ లోపలికి వెళ్ళేందుకు దారి కనిపించలేదు. ఎట్టకేలకు తెలంగాణా అసెంబ్లీలోకి అయినా వెళ్ళారు కానీ ఏపీలో మాత్రం నో వే అన్నట్లుగా ఉంది. మరో వైపు చూస్తే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఇండిపెండెంట్ల ప్రవేశం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. విజయనగరం నుంచి టీడీపీ రెబెల్ మీసాల గీత చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు దక్కడం కూడా విశేషం. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత ఈసారి గెలిచి వస్తే అసెంబ్లీలో ఇండిపెండెంట్లకు ఆస్కారం ఉండొచ్చు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీ కళకళలాడడం ఖాయమని అంటున్నారు. వారూ వీరూ అని మాత్రమే కాకుండా కనీసంగా నాలుగు రాజకీయ పక్షాలు అయినా ఉంటే వ్యక్తిగత విమర్శలు ఎంతో కొంత తగ్గి అర్ధవంతమైన చర్చకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.