ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో.. విజయవాడ మావోయిస్టు.. మోస్ట్ వాంటెడ్
శుక్రవారం జాతీయ మీడియాలోనూ పతాక స్థాయిలో కనిపించిన ఈ ఎన్ కౌంటర్ దంతెవాడ-నారాయణ్ పుర్ సరిహద్దులో జరిగింది.
By: Tupaki Desk | 5 Oct 2024 12:51 PM GMTఅత్యంత పక్కా వ్యూహంతో.. రెండు రోజుల పాటు సాగిన ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద ఎన్ కౌంటర్. ఏకంగా 1,500 మంది జవాన్లు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొనడాన్ని బట్టి దీని తీవ్రత ఏమిటో తెలుసుకోవచ్చు. శుక్రవారం జాతీయ మీడియాలోనూ పతాక స్థాయిలో కనిపించిన ఈ ఎన్ కౌంటర్ దంతెవాడ-నారాయణ్ పుర్ సరిహద్దులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
31 మృతదేహాల లభ్యం..
ఛత్తీస్ గఢ్ లో ఇటీవలి వరుస ఎన్ కౌంటర్లలో దాదాపు 190 మందిపైగా మావోయిస్టులు చనిపోయారు. వినాయక చవితికి ముందు కూడా ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా 31 మంది మృతదేహాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నట్లు దంతెవాడ అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ తెలిపారు.
రెండు రోజుల ముందే..
శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగినప్పటికీ.. ఈ నెల 3న ఉదయమే దీని ఆపరేషన్ ను ప్రారంభించినట్లు ఎస్పీ చెప్పారు. మావోయిస్టులకు చెందిన కంపెనీ నం.6, తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్ థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో కచ్చితంగా నిర్ధారణ చేసుకుని ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులకు ఏమాత్రం కనిపించకుండా కొండ ప్రాంతానికి వెళ్లామని.. 10 కి.మీ. మేర బైక్ లపై, తర్వాత 12 కిలోమీటర్లు కాలినడక వెళ్లామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కాల్పులు ప్రారంభమై నెందూర్, థుల్‌థులి గ్రామాల్లో చీకటి పడేవరకు కొనసాగినట్లు వివరించారు.
లిబరేషన్ గెరిల్లా..
చనిపోయిన మావోయిస్టులు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత వారు ఎవరన్నది తెలుస్తుందని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ అనంతరం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సుందర్ రాజ్ చెప్పరు. వీటిలో ఏకే-47, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్, ఎల్ ఎంజీ, మందుగుండు సామగ్రి ఉన్నట్లు చెప్పారు.
మోస్ట్ వాంటెడ్ లు..
ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 5 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయారు. 31 మృతదేహాలను స్వాధీనం అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా కూంబింగ్ సాగుతోంది. కాగా, కమలేశ్.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు. ఈయన ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. కమలేశ్ ది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతం అని చెబుతున్నారు. ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారని అంటున్నారు.