Begin typing your search above and press return to search.

కొన ఊపిరితో నక్సలిజం.. ఐదు దశాబ్దాల ఉద్యమానికి ఆఖరి గడియలు

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పంతం పట్టి పనిచేస్తోంది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 9:30 AM GMT
కొన ఊపిరితో నక్సలిజం.. ఐదు దశాబ్దాల ఉద్యమానికి ఆఖరి గడియలు
X

ఐదు దశాబ్దాల నక్సల్ బరి ఉద్యమం ఆఖరి గడియలు అనుభవిస్తోందా? వరుస ఎన్ కౌంటర్లతో విప్లవకారులు అమరులు అవుతున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తానని కేంద్ర పట్టుదలగా ఉంది. ఆపరేషన్ కాగర్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండటంతో ఉద్యమకారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానంగా గత ఏడాది నుంచి మావోయిస్టు ఉద్యమం ఊపిరితీసుకోలేనంత నిర్బంధాన్ని అనుభవిస్తోంది. 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలోనే అత్యధికంగా గత ఏడాది సుమారు 260 మంది ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. ఇక ఈ ఏడాది తొలి నెలలోనే మూడు భారీ ఎన్ కౌంటర్లలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలని కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పంతం పట్టి పనిచేస్తోంది. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో చాలా ఫోకస్ చేశారు. ఎప్పటికప్పుడు భద్రతాదళాలతో సమీక్షిస్తూ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేంతవరకు దేశంలో 200 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఈ పదేళ్లలో పోలీసు ఆపరేషన్ పెరిగిపోవడం, కొత్తగా మావోయిస్టుల రిక్రూట్ మెంట్ లేకపోవడం వల్ల మావోయిస్టుల ప్రభావం 40 జిల్లాలకే పరిమితమైంది. గతంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమం బలంగా నడిచేది. అయితే ప్రస్తుతం కేవలం చత్తీస్ ఘడ్, ఆ రాష్ట్రంతో ఉన్న ఒడిసా సరిహద్దుల్లోనే మావోల ప్రభావం కాస్తోకూస్తో కనిపిస్తోంది. గత ఏడాది నుంచి భద్రతా దళాల గస్తీ మరింత పెరగడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు.

ఆపరేషన్ కాగర్ తో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. కేంద్రం ఈ ఆపరేషన్ ప్రకటించి వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులు లేని భారత్ ను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. దీంతో గస్తీ పెరిగి దాదాపు 800 మంది మావోయిస్టులు లొంగిపోవడమే, ఎన్ కౌంటర్లలో చనిపోవడమో జరిగింది. ఇదే సమయంలో కొత్తగా ఎవరూ మావోయిస్టుల్లో చేరకపోవడంతో ఆ ఉద్యమం చివరి మజిలీకి చేరిందనే విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల్లో పాత తరం వారే ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా వంద లోపే ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు ఉద్యమానికి గుండెకాయ వంటి బస్తర్ అడవుల్లోని అబూజ్ మడ్ ప్రాంతంలో పోలీసులు తిష్ట వేయడంతో షెల్టర్ లేక ఉద్యమకారులు అల్లాడిపోతున్నారు.

ప్రస్తుతం ఉన్న మావోయిస్టుల్లో ఎక్కువ మంది వ్యూహకర్తలే మిగిలినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోరాడే వారిని పార్టీ భారీగా కోల్పోయింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడం కూడా కష్టంగా మారిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర కమిటీలోని 14 మంది ముఖ్యనేతలతోపాటు రాష్ట్ర, జోనల్ స్థాయి కమాండర్లు మాత్రమే ప్రాణాలతో ఉన్నారంటున్నారు. వీరికి సరైన షెల్టర్ లేకపోవడం, అనారోగ్య కారణాలు వల్ల రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులదే పైచేయి కావడంతో ఉద్యమం బలహీనపడినట్లేనని అంటున్నారు.

ఐదు దశాబ్దాల మావోయిస్టుల ఉద్యమంలో చివరి రెండు దశాబ్దాలు ఆ పార్టీని దెబ్బతీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నక్సలిజం మావో సిద్ధాంతం వైపు మళ్లిన తర్వాత ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు. ఇదే సమయంలో కొత్తగా యువత నక్సలిజంవైపు ఆకర్షితులు కాకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా మావోయిస్టుల బలాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించింది అంటున్నారు. ఇదే సమయంలో కోవర్టు ఆపరేషన్ పెరిగిపోవడం, పార్టీ సానుభూతిపరులపైనా నిఘా ఎక్కువవడం వల్ల మావోయిస్టులు ఊపిరి సలపలేని పరిస్థితి ఎదురైంది. దీంతో గత 20 ఏళ్లలో సుమారు 5249 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. ఇలా గత 20 ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్న మావోయిస్టులు గత ఏడాది నుంచి పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం విధించుకున్న లక్ష్యానికంటే ముందుగానే మావోయిస్టు ఉద్యమం చాపచుట్టేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.