తమిళ లొల్లి మధ్య ముంబైలో మరాఠీ మంటలు.. మరో భాషా వివాదం
మరాఠీ.. మహారాష్ట్ర ప్రజల భాష. మరి ముంబైలో..? ఎందుకంటే ముంబై దేశ ఆర్థిక రాజధాని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడుతుంటారు.
By: Tupaki Desk | 7 March 2025 2:48 PM ISTఒకవైపు తమిళనాడు లేవనెత్తుతున్న ప్రభుత్వం హిందీ వివాదం చల్లారక ముందే.. మరో భాషా వివాదం కమ్ముకుంది.. తమిళ సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నిస్తుంటే.. మహారాష్ట్రలో ముంబై మరాఠీ రగడ మొదలైంది.. దీనంతటికీ కారణం.. ఆర్‌ఎస్‌ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు..
మరాఠీ.. మహారాష్ట్ర ప్రజల భాష. మరి ముంబైలో..? ఎందుకంటే ముంబై దేశ ఆర్థిక రాజధాని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడుతుంటారు. వలస కూలీలు ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు వీరిలో ఉంటారు. గతంలో ముంబైలో ఉద్యోగాల కోటా వివాదం రేపింది. బిహారీలు, ఉత్తరాది వారు వచ్చి స్థానికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ నాయకులే రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ముంబై మరాఠీలదే అనే నినాదం కొంతకాలం నడిచింది.
తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలు రగడకు కారణమయ్యాయి. ముంబైకు ఒకే భాష అంటూ ఏదీ లేదని.. అసలు ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లోనే భిన్న భాషలు ఉన్నాయని.. ఇప్పుడు నేనున్న ఘట్‌కోపర్ లో గుజరాతీ మాట్లాడతారని ఉదహరించారు. కాబట్టి ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం లేదంటూ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా శివసేన (యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ జోషి వ్యాఖ్యల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ రహస్య అజెండా ఉందని ఆరోపించారు. ముంబైని చీల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని అన్నారు. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ లో ఇలానే మాట్లాడి క్షేమంగా వెనక్కు రాగలరా అంటూ జోషిని సవాలు చేశారు.
భయ్యాజీ జోషీ వ్యాఖ్యలు వివాదంగా మారే ప్రమాదం నెలకొనడంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ వెంటనే స్పందిచారు. మరాఠా ముంబైతో పాటు మహారాష్ట్ర భాష అని అభివర్ణించారు. ఇక్కడ ఉండేవారంతా మరాఠీ నేర్చుకుని మాట్లాడాల్సిందేనని స్పష్టం చేశారు. ఫడణవీస్ ఆర్ఎస్ఎస్ మనిషి. అలాంటి నాయకుడి నుంచే తన వ్యాఖ్యలపై ఖండన తరహాలో స్పందన రావడంతో భయ్యాజీ జోషి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. మరాఠీ ముంబై, మహారాష్ట్రకు చెందినదని చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారు, ఇతర భాషలు మాట్లాడేవారు కూడా మరాఠీని అర్థం చేసుకోవడం అవసరమని తెలిపారు.