Begin typing your search above and press return to search.

మార్బర్గ్ వైరస్... ప్రపంచానికి మరో మహమ్మారి పొంచి ఉందా?

ఈ వ్యాధి రువాండాలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలను బలిగొంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 5:30 PM GMT
మార్బర్గ్  వైరస్... ప్రపంచానికి మరో మహమ్మారి పొంచి ఉందా?
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరో వైరస్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఆరు మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఆ వ్యాధి స్వభావం, లక్షణాలు, ఎలా వ్యాపిస్తుంది, నివారణా చర్యలు వంటివి తెలుసుకుందాం..!

అవును... రువాండా ఇప్పుడు మార్బర్గ్ వైరస్ వ్యాధిని ఎదుర్కొంటోంది. ఇది హెమరేజిక్ జ్వరంతో కూడిన తీవ్రమైన అనారోగ్యం. ఈ వ్యాధి రువాండాలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలను బలిగొంది. ఈ సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యమంత్రి పిలునిచ్చారు.

మార్బర్గ్ వైరస్ వ్యాధి అనేది తీవ్రమైన అనారోగ్యానికి దారితీసి, అనంతరం మరణానికి కూడా దారితీసె వ్యాధి! జర్మనీలో 1967లో ఈ వైరస్ ను మొట్టమొదటిసరిగా గుర్తించారు. ఇది సోకిన జంతువులతోనూ, ప్రధానంగా గబ్బిలాలతో మానవులకు వ్యాపిస్తుంది!

ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే... మార్బర్గ్ వైరస్ వ్యాధి సాధారణ లక్షణం అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రవాలు, ఇతర శరీర ద్రవాల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది! అయితే ఈ వ్యాధికి ప్రస్తుతానికి నిర్ధిష్టమైన చికిత్స అంటూ లేదు!

ఈ మార్బర్గ్ వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి.. వ్యక్తులు మంచి పరిశుభ్రతను పాటించాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో సంబంధాన్ని నివారించాలి. వీరిని చూసుకునేటప్పుడు తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... ఈ లక్షణాలు ప్రారంభమైనప్పటి నుంచి ఐదు - ఏడు రోజుల మధ్య తీవ్రమైన రక్తస్రావ వ్యక్తీకరణలు కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ సోకిన ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల తర్వాత కొంతమందికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు.

అయినప్పటికీ కోవిడ్-19 వైరస్ తో పోలిస్తే ఈ మహమ్మారి ప్రమాదం తక్కువగా ఉందని చెబుతున్నారు. దీనివల్ల కాస్త ప్రమాదం ఉన్నప్పటికీ.. సకాలంలో స్పందించి, నియంత్రణ ప్రయత్నాలు ఇది ప్రపంచ మహమ్మారిగా పరిణామం చెందకుండా నిరోధించడంలో సహయపడతాయని అంటున్నారు.