ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి... వయసెంతో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులున్నా, ఎంత భారీ సంపాదన ఉన్నా, ఆరోగ్యంగా ఉన్న తర్వాతే ఏదైనా ప్రయోజనం అని చెబుతుంటారు
By: Tupaki Desk | 21 Aug 2024 3:55 AM GMTఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులున్నా, ఎంత భారీ సంపాదన ఉన్నా, ఆరోగ్యంగా ఉన్న తర్వాతే ఏదైనా ప్రయోజనం అని చెబుతుంటారు. ఇలా సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నవారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుష్షుతో జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. నూరేళ్లు కాదు అంతకు మించి జీవించిన వృద్ధురాలు మృతి చెందారు.
అవును... ఈ జనరేషన్ జనాలు వందేళ్లు బ్రతకడం సంగతి కాసేపు పక్కనపెడితే.. కనీసం ఆ ఆలోచన కూడా చేయరనేది చాలా మంది చెప్పే మాట. ఎంత ఫిట్ నెస్ గా ఉన్నా.. మరెంతో జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నా.. మారుతున్న జీవన శైలి, కాలుష్యం, కొత్త కొత్త వైరస్ ల కారణంగా నిండు నూరేళ్ల జీవితం ఆల్ మోస్ట్ అసాధ్యం అనే మాటలు వినిపిస్తుంటాయి.
అయితే తాజాగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన స్పెయిన్ మహిళ మరియా బ్రన్యాస్ మృతి చెందారు. ఈమె వయసు 117 సంవత్సరాలు. ఈమె ఆ వయసులో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మరియా బ్రన్యాస్ 1907 మార్చి 4న అమెరికాలో జన్మించారు.
అయితే చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆమె తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూడటమే కాకుండా.. కోవిడ్ మహమ్మారిని సైతం ఎదుర్కొని నిలబడ్డారు. అయితే ఇప్పుడు ఆమె మృతి చెందారు. దీంతో... ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మరణించినట్లయ్యింది.
కాగా... గత ఏడాది లూసిల్ రాందన్ మృతి తర్వాత మరియా బ్రన్యాస్ ప్రపంచంలో అత్యధిక వయసున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన సంగతి తెల్లిసిందే. ఈమె మరణానంతరం ఇప్పుడు జపాన్ కు చెందిన టొమికో ఇటూక అనే వృద్ధురాలు ఆ జాబితాలో నిలిచారు. ఆమె వయసు 116 ఏళ్లు.