$200 బిలియన్స్ క్లబ్ లోకి మార్క్ జుకర్ బర్గ్... ముందున్న ముగ్గురూ వీరే!
మెటా ఫ్లాట్ ఫామ్స్ లాభాల పంటతో పరుగులెత్తుతున్న వేళ మార్క్ జుకర్ బర్గ్ ఓ అరుదైన ఘనత సాధించారు.
By: Tupaki Desk | 30 Sep 2024 8:30 AM GMTసోషల్ మీడియా సంచలనం ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఈ ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఫ్లాట్ ఫామ్స్ ఇప్పుడు లాభాల పంటతో పరుగులెత్తుతుంది. ఈ సమయంలో ఆ సంస్థ యజమాని, యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్ బర్గ్ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు.
అవును... మెటా ఫ్లాట్ ఫామ్స్ లాభాల పంటతో పరుగులెత్తుతున్న వేళ మార్క్ జుకర్ బర్గ్ ఓ అరుదైన ఘనత సాధించారు. ఇందులో భాగంగా... 40ఏళ్ల వయసులోనే 200 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. ఫలితంగా.. ఈ జాబితాలో చేరిన ప్రపంచలోనే నాలుగో వ్యక్తిగా మార్క్ జుకర్ బర్గ్ రికార్డ్ సృష్టించారు.
తాజాగా బ్లూమ్ బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్ లో మార్క్ జుకర్ బర్గ్ సంపద విలువ 201 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ఈ ఏడాది మెటా షేర్ల విలువ 64 శాతం పెరగడమే మార్క్ సంపద వృద్ధికి అసలు కారణం అని అంటున్నారు.
కాగా చరిత్రలో ఇప్పటివరకూ 200 బిలియన్ డాలర్ల సంపద ఉన్న కుబేరులు ముగ్గురే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ అధినేతగా ఉన్న ఎలాన్ మస్క్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఈయన సంపద విలువ 272 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ ఉన్నారు.
జెఫ్ బెజోస్ సంపద విలువ 211 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్.వీ.ఎం.హెచ్. సహా పలు రంగాల్లో ఎన్నో వ్యాపారాలున్న బెర్నాడ్ ఆర్నాల్డ్ ఉన్నారు. ఈయన సంపద విలువ 207 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు ఈ ముగ్గురి తర్వాత ఈ జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ (201 బిలియన్ డాలర్స్) తో చేరారు. ప్రస్తుతం మెటా చేతిలో ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సప్ ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ఏఐ అసిస్టెంట్ గా మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదగబోతోందని అంటున్నారు.