మస్కట్ లో పని పేరుతో మోసం..బందీగా మార్కాపురం మహిళ
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పదో వార్డుకు చెందిన షేక్ మక్బుల్ బీ.. ఖాదర్ బాషా దంపతులు. వారికి ఇద్దరు పిల్లాలు.
By: Tupaki Desk | 9 Sep 2024 5:30 AM GMTకాస్త కష్టమైనా.. పంటి బిగువునా ఓర్చుకుంటే పేదరికమనే కష్టం నుంచి బయటపడతామన్న ఆలోచనతో దేశం కాని దేశానికి బయలుదేరి వెళ్లిన మార్కాపురం మహిళకు అనుకోని కష్టం ఎదురైంది. కాసుల సంగతి తర్వాత.. ఒక గదిలో బందీగా మారిన మార్కాపురం మహిళ తాజాగా ఒక సెల్ఫీ వీడియోను పోస్టు చేసింది.తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తనను సేవ్ చేయాలంటూ రిక్వెస్టు చేస్తోంది. తమ బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఊరు దాటిని ఆమె.. ఇప్పుడు మస్కట్ లోని ఒకరింట్లో చిక్కుకుపోయింది. తన సెల్ఫీ వీడియోతో తన ఆవేదనంతా చెప్పుకున్న ఆమె వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పదో వార్డుకు చెందిన షేక్ మక్బుల్ బీ.. ఖాదర్ బాషా దంపతులు. వారికి ఇద్దరు పిల్లాలు. భార్యభర్తలు ఇద్దరు కూలీకి వెళుతూ బతుకుబండిని లాగుతుంటారు. తమ బతుకులు బాగు పడే అవకాశం కోసం చూస్తున్న వారు.. మస్కట్ లోని ఒక ఇంట్లో పని కోసం ఆమె హైదరాబాద్ లోని ఒక ఏజెంట్ ద్వారా అక్కడకు వెళ్లారు. ఆగస్టు 25న మస్కట్ కు వెళ్లిన ఆమెకు.. రోజులు గడుస్తున్నా యజమాని పని చూపకపోవటమే కాదు.. ఒక గదిలో బందించిన వైనంతో ఆమె హడలిపోయింది.
ఒకపూటే ఆహారాన్ని ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గాన్ని తాజాగా ఆమె తన సెల్ఫీ వీడియోతో చెప్పుకుంది. తనను తిరిగి పంపించాలని కోరితే రూ.1.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తనను ప్రభుత్వం కాపాడాలంటూ కన్నీటిపర్యంతమైన మక్బుల్ బీ తనను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని కోరుతోంది. అయ్యో అనిపించేలా ఉన్న ఈ ఉదంతంపై ఏపీ సర్కారు వెంటనే స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.