సీజనూ సీజనూ... 38 లక్షల వివాహాలు - రూ.5 లక్షల కోట్ల బిజినెస్!
అవును... పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కాబోతుంది. నవంబర్ 23 నుంచి మొదలుకానున్న ఈ పెళ్లిళ్ల సీజన్ లో మార్కెట్ లో భారీ ఎత్తున బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 22 Nov 2023 3:23 AM GMTపెళ్లంటే పందిళ్లు.. సందళ్లు, తప్పెట్లు.. తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు, ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు మాత్రమే కాదు వాటి మధ్యలో లక్షలు, కోట్ల రూపాయల లావాదేవీలు కూడా! నాటికీ.. నేటికీ పెళ్లి సంప్రదాయాల్లో వచ్చిన ఎన్నో మార్పులు.. వెరసి ఖర్చును తడిసి మోపెడు చేస్తున్నాయి! అయినా ఖర్చు గురించి ఆలోచించే సందర్భమా అది..? లైఫ్ లో ఒకే ఒక్కసారి జరిగే ముచ్చట! తాజాగా ఆ ముచ్చటల సీజన్ మొదలవ్వబోతుంది. ఈసారి సీజన్ లో మామూలుగా ఉండదంటుంది!
అవును... పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కాబోతుంది. నవంబర్ 23 నుంచి మొదలుకానున్న ఈ పెళ్లిళ్ల సీజన్ లో మార్కెట్ లో భారీ ఎత్తున బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. రేపటినుంచి ప్రారంభం కాబోయే ఈ పెళ్లిళ్ల సీజన్ లో దేశవ్యాప్తంగా సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక వీటికోసం సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగనున్నట్లు మార్కెట్ నిపుణుల అంచనా!
ఈ వివాహ సీజన్ నవంబర్ 23 నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 15 వరకు ఉంటుంది. పైగా ఈ సీజన్ లో తొలిరోజే భారీస్థాయిలో వివాహాలు జరగనున్నాయని చెబుతున్నారు. దీంతో... ఈ నెల 23న జరగాల్సిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను 25కి మార్చిన సంగతి తెలిసిందే. అంటే ఆ స్థాయిలో ఆ రోజు వివాహాలు జరగనున్నాయన్నమాట. ఇదే సమయంలో ముఖ్యంగా నవంబర్ 23, 24, 27, 28, 29 తోపాటు డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15 తేదీలు వివాహాలకు అనువైన రోజులు అని చెబుతున్నారు.
ఇలా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ సీజన్ లో జరగబోయే పెళ్లిళ్లు... వాటి పేరున జరిగే మార్కెట్ లావాదేవీలపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఒక అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం ఈ ఏడాది సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని.. ఈ వేడుకలకు పెట్టే ఖర్చు ద్వారా మార్కెట్ లో రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరగనున్నట్లు చెబుతున్నారు.
అయితే... గతేడాది ఇదే సీజన్ లో దేశవ్యాప్తంగా సుమారు 32 లక్షల పెళ్లిళ్లు జరగగా.. వీటి ద్వారా సుమారు 3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు అంచనా. 30 నగరాల్లో సేకరించిన వివరాల ఆధారంగా సీఏఐటీ ఈ అంచనాలు వేసింది. ఇక ఈ పెళ్లిళ్లను వాటికి అయ్యే ఖర్చు ఆధారంగా రకరకాలుగా విభజించి కూడా లెక్కలు చెబుతున్నారు. ఇందులో భాగంగా కనీసం రూ. 3 లక్షల నుంచి మొదలై రూ. కోటికి పైగా ఖర్చు చేసే పెళ్లిళ్లను అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కల ప్రకారం... రూ.3 లక్షల ఖర్చు అంచనాతో దాదాపు 7 లక్షల పెళ్లిళ్లు, రూ.6 లక్షల ఖర్చు అంచనాతో 8 లక్షల పెళ్లిళ్లు, రూ.10 లక్షల ఖర్చు అంచనాతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ.15 లక్షల ఖర్చుతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ.25 లక్షల ఖర్చు అంచనాతో 5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... రూ.50 లక్షల ఖర్చు అంచనాతో 50 వేల పెళ్లిళ్లు జరగనుండగా... రూ.కోటి ఆ పైన ఖర్చు చేసే పెళ్లిళ్లు మరో 50 వేల వరకూ ఉండొచ్చని అంచనా వేశారు.
దీంతో ఈ ఏడాది భాజాభజంత్రీల చప్పుడు గతేడాదితో పోలిస్తే మరింత బలంగా వినిపించబోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే 4 లక్షల వివాహాలు జరగనున్నాయని.. తద్వారా రూ.1.25 లక్షల కోట్ల బిజినెస్ జరగనుందని అంచనా వేస్తున్నారు!