అద్రుష్టమంటే మల్లారెడ్డి అల్లుడిదే!
నిజానికి మల్కాజిగిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచారు
By: Tupaki Desk | 19 Oct 2023 8:41 AM GMTఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కుతుందని ఆ నాయకుడు కలలోనైనా ఊహించి ఉండరు. ముందుగానే ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించేయడం జరిగింది. ఇక మరోసారి లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు కూడా. కానీ అనూహ్యంగా అద్రుష్టం కలిసొచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వరించింది. ఆ నాయకుడే.. మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ బీ ఫామ్ అందించడంతో ఈ విషయం అధికారికంగా కన్ఫామ్ అయింది.
నిజానికి మల్కాజిగిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మరోవైపు 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు కంటోన్మెంట్ నియోజకవర్గ బాధ్యతలనూ పార్టీ రాజశేఖర్ రెడ్డికి అప్పగించింది. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ను మొదట మైనంపల్లికే కేసీఆర్ కేటాయించారు. కానీ తన తనయుడు రోహిత్ కు మెదక్ సీటు ఇవ్వలేదనే కారణంతో తన టికెట్ కూడా కాదనుకున్న మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిపోయారు.
దీంతో మల్కాజిగిరి స్థానం ఖాళీ అయింది. దీనిపై మర్రి రాజశేఖర్ రెడ్డి కన్నేశారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఈ విషయంలో అల్లుడికి అండగా నిలిచారు. తెరవెనుక మంతనాలు జరిపారు. రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కేటీఆర్ ను కలిశారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. అంతే కాకుండా ఇప్పటికే మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ బలాన్ని చాటేందుకు పెద్ద ఎత్తున రోడ్ షో కూడా నిర్వహించారు. ఇప్పుడు అద్రుష్టం కలిసొచ్చి టికెట్ దక్కించుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ పార్టీకి ఎదురు తిరిగిన మైనంపల్లిని ఎలాగైనా ఓడించేందుకు బీఆర్ఎస్, కేసీఆర్ కసరత్తలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ కచ్చితంగా అండగా నిలుస్తారనే చెప్పాలి. మరోవైపు డబ్బు కూడా ఉంది. ఇంకేమందీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం, మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.