ఫైనల్: మల్లారెడ్డి అల్లుడే.. మల్కాజిగిరి అభ్యర్థి!
ఇందులో భాగంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో భారీ ర్యాలీని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి.
By: Tupaki Desk | 27 Sep 2023 5:35 AM GMTఎన్నికలకు నెలల ముందే అభ్యర్థుల్ని ఫైనల్ చేసేసిన గులాబీ బాస్ నిర్ణయం.. ఆ పార్టీలో చిన్న చిన్న తుపాన్లకు కారణమైన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ను కన్ఫర్మ్ చేసినా.. ఆయన కుమారుడికి మెదక్ టికెట్ ఆశిస్తే.. దాన్ని ఇవ్వకపోవటం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని మైనంపల్లి.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. తన కొడుక్కి టికెట్ రాకుండా అడ్డుకున్న మంత్రి హరీశ్ రావుపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
ఈ మొత్తం వివాదం తిరిగి తిరిగి.. చివరకు బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి గుడ్ బై చెప్పే వరకు వెళ్లింది.ఈ రోజు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. ముందస్తుగా జరిగిన చర్చల్లో భాగంగా మల్కాజిగిరి.. మెదక్ సీట్లను తనకు.. తన కుమారుడికి ఇచ్చే ఒప్పందంపై మైనంపల్లి పార్టీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. మైనంపల్లి దారి ఏమిటన్న దానిపై క్లారిటీ వచ్చేసినంతనే.. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి తెచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేశారు గులాబీ బాస్ కేసీఆర్.
మైనంపల్లి నోట మాట తేడా వచ్చినంతనే.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీన్లోకి తెచ్చేందుకు వీలుగా తెర వెనుక ప్రయత్నాలు చేశారు. తాజాగా.. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఢిల్లీలో మైనంపల్లి కాంగ్రెస్ లో చేరే వేళ.. ఆ ప్రభావం నియోజకవర్గం మీద ఉండకుండా ఉండేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తోంది గులాబీ అధినాయకత్వం.
ఇందులో భాగంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో భారీ ర్యాలీని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. ఈ రోజు (బుధవారం) ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్ వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేవారు. ఉదయం 11 గంటల నుంచి బలప్రదర్శన తలపించేలా ఈ ర్యాలీ సాగనుంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ను 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేయటం.. ఆ ఎన్నికల్లో ఆయన రేవంత్ రెడ్డి మీద ఓడిపోవటం తెలిసిందే.
అంగబలం.. అర్థబలం ఉన్న మల్లారెడ్డి అల్లుడికి టికెట్ ఇవ్వటం ద్వారా మైనంపల్లికి గట్టి పోటీఇచ్చేలా గులాబీ బాస్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరోవైపు జనగామ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. వీరికి కూడా గులాబీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న గోషామహల్ స్థానికి నందకిశోర్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ పేర్లను వెల్లడిస్తారని చెబుతున్నారు.