అంగారకుడిపై బీచ్ గుర్తించిన శాస్త్రవేత్తలు... తెరపైకి కీలక విషయాలు!
ఈ సమయంలో.. ఆ గ్రహంపై సుమారు 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన రోవర్ అందించిన డేటా ఆధారంగా వారు ఈ క్లారిటీకి వచ్చారని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 8:30 AM GMTమనిషి తదుపరి మజిలీ అంగారక గ్రహం అని చాలా మంది భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికిపై స్పందించిన ఎలాన్ మస్క్... అంగారకుడిపైకి మరో పదేళ్లలోపే మనుషులను పంపించగలుగుతామని.. 20 ఏళ్లలో అక్కడ నగరాన్ని నిర్మిస్తామని ఇటీవల ఎక్స్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... మనిషి మనుగడకు అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆ గ్రహంపై సుమారు 300 కోట్ల సంవత్సరాల నాటి బీచ్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనాకు చెందిన రోవర్ అందించిన డేటా ఆధారంగా వారు ఈ క్లారిటీకి వచ్చారని అంటున్నారు.
1970లలో నాసాకు చెందిన మెరైనర్-9 వ్యోమనౌక అందించిన చిత్రాల్లో... అంగారకుడిపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని వెల్లడైంది. నాటి నుంచి ఆ గ్రహంపై నీటి ప్రవాహానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా... ఆ గ్రహంపై 450 కోట్ల ఏళ్ల కిందటే నీరు ఉండేదనడానికి అక్కడ నుంచి వచ్చిపడ్డ ఉల్కల్లో ఆధారాలు దొరికాయని అంటున్నారు.
వాస్తవానికి.. గత కొన్నేళ్లలో అంతరిక్ష శిలలు ఢీ కొట్టుకోవడం వల్ల అక్కడ ఏర్పడ్డ బిలాల్లోని ఉపరితలం కింద ఐస్ ఉన్నట్లు కూడా తేలిందని అంటున్నారు. అయితే.. అంగారకుడిపై నీరు ఉంటే.. అది ఎంత పరిమాణంలో ఉడేది.. అక్కడ నీరు ఎంతకాలం మనుగడ సాగించింది, అక్కడ సముద్రాలు ఉండేవా అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలకు కీలకంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే అంగారకుడిపైకి చైనా పంపిన జురాంగ్ రోవర్ అందించిన డేటా అధారంగా తాజాగా ఆ దేశంతో పాటు అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఈ సందర్భంగా.. అక్కడ ఉతోపియా ప్లానీషియా అనే ప్రదేశంలో ఒకప్పుడు మహా సముద్రం ఉండేదని.. దీని ఆధారంగా అక్కడ ఓ బీచ్ ఉండేదని తేల్చారు.
ఈ పరిశోధన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ లో ప్రచురించబడ్డాయి. ఈ సందర్భంగా... అంగారక గ్రహంపై గత వాతావారణం, పురాతన జీవితం అవకాశాలపై వారి అవగాహనను మెరుగుపరుచుకునే లక్ష్యంగా పరిశోధకులు డేటాను విశ్లేషిస్తూ ఉన్నారు.