"హాలోవీన్" హర్రర్.. ఇద్దరు మృతి.. అసలేం జరిగింది?
సమయం ఏదైనా, వేడుక మరేదైనా.. అమెరికాలో కాల్పుల చప్పళ్లు వినిపిస్తూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 2 Nov 2024 4:15 AM GMTసమయం ఏదైనా, వేడుక మరేదైనా.. అమెరికాలో కాల్పుల చప్పళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీకెండ్ పార్టీలైనా, పార్కుల్లో అయినా, విద్యాసంస్థల్లో అయినా, ఎన్నికల ప్రచారంలో అయినా.. తుపాకీ మోత మోగాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. అమెరికాలో ఆందోళనకరంగా మారిన గన్ కల్చర్ కి ఇవన్నీ ఉదాహరణలు.
ఈ నేపథ్యంలో సుమారు 50,000 నుంచి 1,00,000 వరకూ పాల్గొన్నట్లు చెబుతున్న "హాలోవీన్" వేడుకల్లోనూ తుపాకీ మోత మోగింది. శుక్రవారం తెల్లవరుజామున 1:07 గంటల ప్రాంతంలో హాలోవీన్ వేడుకల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. సుమారు ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది.
అవును... ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండో నగరంలోని హాలోవీన్ వేడుకలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. దాదాపు ఏడుగురికి గాయలైనట్లు తెలుస్తోంది. డౌన్ టౌన్ ప్రాంతంలో కాల్పులు జరిగిన కొద్దిసేపటికే.. రాష్ట్ర పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా... ఓ 17 ఏళ్ల వయసున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన ఓర్లాండో పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్... హాలోవీన్ వేడుకల కోసం పెద్ద ఎత్తున గుమిగూడిన 7 వేర్వేరు క్లబ్ లతో కూడిన నైట్ లైఫ్ ప్రాంతం అయిన ది బ్లాక్ బయట ఈ ఘోరమైన కాల్పులు జరిగాయని అంటున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన వారిని స్థాయిన ఆస్తుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. బాధితుల వయసు 19 నుంచి 31 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు. ఘటన జరిగిన కాసేపటికే జైలెన్ డ్వేన్ ఎడ్గార్ (17) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇతడు ఇంతకముందు 2023లో భారీ దొంగతనం కేసులో అరెస్టయ్యాడని పోలీసులు చెబుతున్నారు. అతడు తుపాకీ ఎలా సంపాదించాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల నిఘా వీడియోలో... అనుమానితుడు పసుపు చొక్కా ధరించి, గుంపులో నడుస్తున్నడు. ఆ సమయంలో అతడి కుడి చేయి పైకెత్తి కాల్పులు జరిపినట్లు కనిపించాడు.
ఈ సమయంలో సుమారు 100 మంది పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నారని.. కాల్పులు జరిగిన వెంటనే షూటర్ ని అదుపులోకి తీసుకున్నారని స్మిత్ తెలిపారు. తదుపరి విచారణ జరుగుతుందని అన్నారు!