కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి.. మంటల్లో హెలికాప్టర్ గల్లంతు
ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఉయిసాంగ్ కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మందిపైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు నిమగ్నమయ్యారు.
By: Tupaki Desk | 26 March 2025 7:29 AMఎప్పుడూ ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలతో వార్తల్లో నిలిచే దక్షిణ కొరియాలో అనూహ్యంగా కార్చిచ్చు రేగింది. సాధారణంగా పశ్చిమ దేశాల్లో కనిపించే తరహా కార్చిచ్చు ఇప్పుడు ఈ దేశాన్ని ముంచెత్తుతోంది. విషాదం ఏమంటే ఈ మంటలను ఆర్పేందుకు వెళ్లిన రెస్క్యూ హెలికాప్టర్ కూడా కార్చిచ్చులో కూలిపోయింది.
దక్షిణ కొరియాలోని ఉయిసాంగ్ కౌంటీలో దావానలం రేగింది. ఈ మంటలు చకచకా చుట్టేస్తున్నాయి. గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వీటి ధాటికి 1,300 ఏళ్ల నాటి గౌన్సా ఆలయం కూడా దగ్ధమైంది. కాగా, కార్చిచ్చు ఒక్కసారి అంటుకుంటే ఆపడం చాలా కష్టం.
వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల కారణంగా కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. ఒక్కసారి అంటుకుంటే కొన్ని రోజుల పాటు ఆగకుండా రగులుతూనే ఉంటాయి. ఒకచోట ఆర్పినా మరోచోట నిప్పు రాజుకుంటుంది. దక్షిణ కొరియాలో 43 వేల ఎకరాలు కాలి బూడిద కావడమే దీనికి నిదర్శనం.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఉయిసాంగ్ కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మందిపైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు నిమగ్నమయ్యారు. కొన్ని వేలమందిని ఖాళీ చేయించారు. దాదాపు మూడో వంతు మంటలు అదుపులోకి వచ్చాయని చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ జియోంగ్ సాంగ్, ఉల్సాన్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయి.
కార్చిచ్చును అత్యంత ఘోరమైనదిగా దక్షిణ కొరియా ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్-సూ అభివర్ణించారు. దక్షిణకొరియా అధ్యక్షుడు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, కార్చిచ్చును ఆపేందుకు పంపిన హెలికాప్టర్ కూలిపోయి పైలెట్ మృతి చెందాడు. మంటల
కారణంగా దాదాపు 19 మంది మృతి చెందారు.
గాలులు లేకుంటేనే..
ఎక్కడైనా సరే గాలులు లేకుంటేనే కార్చిచ్చులను వెంటనే ఆర్పగలం. ఇప్పుడు దక్షిణ కొరియాలో పొడి గాలులతో దావానాలం చెలరేగుతోంది. అదుపు చేయడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.